
ఇదెక్కడి బాదుడు చంద్రబాబూ..
● స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ సీపీఎం నిరసన
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచింది. ఇదెక్కడి బాదుడు చంద్రబాబూ అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు’ అని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అన్నారు. విద్యుత్ చార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై ఆ పార్టీ నేతలు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని 54వ డివిజన్ వెంకటేశ్వపురం జనార్దనరెడ్డి కాలనీ వద్ద ఉన్న సబ్‌స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, గృహాలకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశారన్నారు. అనేకచోట్ల విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రూ.17 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందన్నారు. అనంతరం స్థానిక విద్యుత్ శాఖ ఏఈ కృష్ణవేణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు, మూలం ప్రసాద్, రషీద్, పద్మ, గడ్డం శ్రీనివాసులరెడ్డి, జాఫర్, వెంకటరత్నం, రామ్మోహన్, అల్లాభక్షు, ఆర్టీసీ బాబు, తదితరులు పాల్గొన్నారు.