
2న స్థాయీ సంఘ సమావేశాలు
నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు వచ్చే నెల 2న జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ మోహన్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశాలు జరుగుతాయన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన 7 స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతాయన్నారు. సమావేశాలకు ఆయా శాఖల జిల్లా అధికారులు, జిల్లా పరిషత్ సభ్యులు తప్పని సరిగా హాజరు కావాలని కోరారు.
ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (వీఆర్సీ సెంటర్): కేంద్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ద్వారా బీడీ కార్మికులకు అందజేసే ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానం పలుకుతోందని బీడీ కార్మిక సంక్షేమ ఆస్పత్రి నెల్లూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కేవీ భాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. 2025–26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి నుంచి పీజీ కోర్సులు అభ్యసించే బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రీ మెట్రిక్ కేటగిరీలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 31వ తేదీ చివరి తేదీ కాగా, పోస్ట్ మెట్రిక్ కేటగిరీలో ఇంటర్ నుంచి ఆ పైబడిన కోర్సులు చదివే విద్యార్థులు అక్టోబర్ 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకో వాలని తెలిపారు. ఇతర వివరాలకు స్కాలర్ షిప్ పోర్టల్ www. scholarships. gov. in లాగిన్‌ను సంప్రదించాలని కోరారు.
నేడు జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం
నెల్లూరురూరల్: జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశం మందిరంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా అభివృద్ధి సమీక్ష (డీడీఆర్‌సీ) కమిటీ సమావేశం జరగనుందని డీఐపీఆర్‌ఓ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి మహమ్మద్ ఫరూక్, పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొని చర్చించనున్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు హాజరుకానున్నారని తెలిపారు.
విద్యలో ఆధునికీకరణలు అవసరం
● మంచు లక్ష్మి
● డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ప్రారంభం
ముత్తుకూరు(పొదలకూరు) : పాఠశాల స్థాయి నుంచే విద్యలో ఆధునికీకరణలు జరగాల్సిన అవసరం ఉందని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని సినీనటుడు మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి అన్నారు. ఆమె స్థాపించిన ‘టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ’ సహకారంతో ముత్తుకూరు ఈదూరు ఈశ్వరమ్మ జెడ్పీ హైస్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌ను మంగళవారం నెల్లూరు నగరం కోటమిట్ట కృష్ణమందిరం మున్సిపల్ హైస్కూల్ నుంచి మంచు లక్ష్మి ప్రారంభించారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో 12 స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ఒక్కొక్క క్లాస్ రూమ్‌కు రూ.2 లక్షలు వెచ్చించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డీఈఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
నర్సింగ్ కోర్సుకు
దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): నర్సింగ్ కోర్సుపై ఆస క్తి ఉన్న గిరిజన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ మల్లికార్జునరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్, యూరోపియన్ యూనియన్ దేశాల్లో నర్సింగ్ కోర్సుల్లో ప్రావీణ్యం పొంది వైద్యసేవా రంగంలో జర్మనీ వంటి దేశాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ రాష్ట్రంలో మూడు కేంద్రాల్లో 75 మందికి జర్మన్ లాంగ్వేజ్, 9 నుంచి 10 నెలల పాటు నర్సింగ్‌లో డిగ్రీ చదివిన గిరిజన యువతులకు ఉచిత వసతితో కూడిన శిక్షణకు గిరిజన సంక్షేమ శాఖతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. బీఎస్సీ నర్సింగ్‌లో రెండేళ్ల క్లినికల్ అనుభవం జీఎన్‌ఎంలో 3 ఏళ్ల అనుభవం కలిగిన 35 ఏళ్ల లోపు ఉన్న వారు అర్హులన్నారు. ఏపీ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ కలిగి ఉండాలన్నారు. జర్మన్ ల్యాంగ్‌లో 8 నుంచి 10 నెలల శిక్షణ, బీ2 స్థాయి పరీక్ష ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఆసక్తి కలిగిన వారు ఐటీడీఏ కార్యాలయ సెంటర్ మేనేజర్ ఎం బాలాజీని 81878 99877, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం 95026 77311 నంబర్లలో సంప్రదించి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.