
సైదాపురం ఎంపీడీఓ సస్పెన్షన్
నెల్లూరు (పొగతోట): ఉపాధి హామీ పనులకు సంబంధించి ఆరోపణల నేపథ్యంలో సైదాపురం ఎంపీడీఓ పి.శివకుమార్‌ను సస్పెండ్ చేస్తూ జెడ్పీ సీఈఓ మోహన్‌రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలపై జరిపిన విచారణలో నిజాలు నిగ్గుతేలడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. కోట మండల పరిషత్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శివకుమార్‌కు సైదాపురం ఎంపీడీఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారానికి కృషి
● రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కోవూరు: కోవూరు షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. మండలంలోని పోతిరెడ్డిపాళెంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి మంగళవారం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చక్కెర కర్మాగారం రైతులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించేందుకు చర్యలు వేగవంతం చేశామన్నారు. వీలైనంత త్వరలోనే ఒక పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోని రామాయపట్నంలో బీపీసీఎల్ పరిశ్రమ ఏర్పాటవుతుందని, దీంతో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కోవూరు చక్కెర కర్మాగారం సమస్యను త్వరగా పరిష్కరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ మంచి పరిపాలన అందించడమే లక్ష్యంగా తామంతా పని చేస్తున్నామని చెప్పారు. తొలుత కోవూరు చక్కర కర్మాగారాన్ని ఎమ్మెల్యేతో కలిసి మంత్రి టీజీ భరత్ పరిశీలించారు.