
పంజా విసిరిన దొంగలు
రైల్వే సిగ్నల్స్‌ను ట్యాంపర్ చేసి పరుగులు తీసే రైళ్లను ఆపి, రిజర్వేషన్ బోగీల్లో దోపిడీకి పాల్పడుతున్న దుండగులు కొంత కాలం విరామం తర్వాత మరోసారి చెలరేగిపోయారు. రిజర్వేషన్ బోగీల్లో భద్రతను పర్యవేక్షించే రైల్వే పోలీసులకు దొంగలు మరోసారి సవాల్ విసిరారు. తొమ్మిది నెలల క్రితం ఇదే తరహాలో పంజా విసిరిన దుండగులపై నిఘా పెరగడంతో అప్పటి నుంచి విరామం ప్రకటించారు. ఆదమరిచి తాజాగా రెండు రైళ్లకు సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఆపి రిజర్వేషన్ బోగీల్లో గాఢ నిద్రలో ఉన్న మహిళా ప్రయాణికుల వద్ద బంగారు నగలు, బ్యాగులు దోచుకెళ్లారు. ఉలికి పడిన రైల్వే పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు.
బిట్రగుంట: సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి రైళ్లలో దోపిడీకి పాల్పడే ముఠా మరోసారి పంజా విసిరింది. ఈ తరహా ఘటనలకు బిట్రగుంటకు సమీపంలోని శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్‌కు అటూ ఇటూ ప్రాంతం అనువుగా ఉండడంతో దుండగులు చెలరేగిపోతున్నారు. తాజాగా శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు రైల్వేసిగ్నల్స్‌ను ట్యాంపర్ చేసి రెండు రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. నలుగురు మహిళా ప్రయాణికుల మెడల్లోని బంగారు అభరణాలు, బ్యాగులు దోపిడీ చేశారు. దోపిడీని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక ప్రయాణికుడిపై రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. మిగిలిన ప్రయాణికులు తేరుకునే లోపే కొండబిట్రగుంట అటవీ ప్రాంతం మీదుగా పారిపోయారు.
సిగ్నల్ ట్యాంపర్ చేసి..
కావలి– శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య దుండగులు బుధవారం తెల్లవారుజామున 1.50 గంటల సమయంలో నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో సిగ్నల్ ట్యాంపర్ చేసి సిగ్నల్స్ కనిపించకుండా చేశారు. ఆ సమయంలో ఽనరసాపురం నుంచి ధర్మవరం వెళ్తున్న (రైలు నంబరు 17247) ధర్మవరం ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ సిగ్నల్స్ కనిపించకపోవడంతో రైలు వేగాన్ని పూర్తిగా తగ్గించాడు. ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. దీంతో రైల్లోకి ప్రవేశించిన దుండుగులు ఎస్–13 బోగీలో బెర్త్ నంబరు 12లో నిద్రిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు మెడలోని బంగారు గొలుసును, ఎస్–11 బోగీలో బెర్త్ నంబర్ 25లో నిద్రిస్తున్న మరో మహిళ బ్యాగును చోరీ చేశారు. ఈ బ్యాగులో సెల్‌ఫోన్‌తో పాటు దుస్తులు ఉన్నాయి. అంతలోనే సిగ్నలింగ్ వ్యస్థలో ఎటువంటి సమస్య లేదని స్టేషన్ మాస్టర్ నుంచి సమాచారం రావడంతో లోకోపైలట్ ట్రైన్ వేగాన్ని పెంచడంతో దుండుగులు రైలు దిగేసి అక్కడే మాటు వేశారు. 2.15 నుంచి 2.30 గంటల మధ్య షిర్డీసాయినగర్ నుంచి తిరుపతి వెళ్తున్న (రైలు నంబరు 07638) తిరుపతి స్పెషల్ ట్రెయిన్ కూడా సిగ్నల్స్ లేక ఎస్వీపీఎం స్టేషన్ సమీపంలో నిలిపేయడంతో దుండుగులు మళ్లీ ట్రెయిన్‌లోకి ప్రవేశించారు. ఎస్–3, ఎస్–5 బోగీల్లోకి ప్రవేశించారు. ఎస్–5 కోచ్‌లో తిరుపతికి వెళ్తున్న ప్రయాణికురాలి మెడలోని 20 గ్రాముల బంగారు దండను లాక్కున్నారు. ఎస్–3 కోచ్‌లో మరో ప్రయాణికురాలి మెడలోని 18 గ్రామలు బంగారు దండను కూడా లాక్కున్నారు. ఈ క్రమంలో ప్రయాణికురాలి భర్త పాపారావు దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా రాళ్లతో దాడి చేసి రైలు దిగేసి కొండ బిట్రగుంట అటవీ ప్రాంతం మీదుగా పారిపోయారు. రాళ్ల దాడిలో పాపారావు తలకు స్వల్పంగా గాయలయ్యాయి. బాధితులు, రైల్వే సిబ్బంది సమాచారంతో రైల్వే పోలీసులు హుటావుటినా సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సిగ్నలింగ్ వ్యవస్థను ఏ విధంగా ట్యాంపర్ చేశారనే విషయంపై స్పష్టత రాలేదు.
9 నెలల తర్వాత మళ్లీ..
సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి రైళ్లలో దోపిడీకి పాల్పడిన ఘటనలు గతేడాది వరుసగా చోటు చేసుకున్నాయి. గతేడాది జూన్ 24వ తేదీ తెల్లవారుజామున తెట్టు వద్ద సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేయడం ద్వారా చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగానే రెండు నెలల వ్యవధిలో అదే ఏడాది ఆగస్ట్ 14వ తేదీ తెల్లవారు జామున వీరేపల్లి వద్ద చైన్నె ఎక్స్‌ప్రెస్, తెట్టు రైల్వే బ్రిడ్జి వద్ద చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి పాల్పడ్డారు. ఇదే తరహాలో సెప్టెంబర్ 16వ తేదీన సింగరాయకొండ వద్ద చైన్నె ఎక్స్‌ప్రెస్‌లో, సెప్టెంబర్ 18న అల్లూరు రోడ్డు వద్ద పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి విఫలయత్నం చేశారు. దీంతో పోలీసులు రైళ్లు, రైల్వే స్టేషన్లలో గస్తీ ముమ్మరం చేయడంతో పాటు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ముమ్మరం చేయడంతో దుండగలు కొంత కాలంగా విరామం ప్రకటించారు. అల్లూరు రోడ్డు ఘటన తర్వాత ఇటువంటి ఘటనలు మళ్లీ చోటుచేసుకోలేదు. తిరిగి 9 నెలల తర్వాత శ్రీవెంకటేశ్వపాళెం వద్ద ఇదే తరహాలో దొంగలు పంజా విసిరి రెండు రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. అయితే బోగీల్లో గస్తీ కాసే పోలీసులు ఆ సమయంలో ఏమయ్యారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్ బోగీల్లో లైట్లు ఆపేసి, ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో దుండగులను పసిగట్టలేని, పట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.
భిన్న కోణాల్లో దర్యాప్తు
రైళ్లలో దోపిడీ ఘటనలపై రైల్వే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సమాచారం అందుకున్న 15 నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు గత అనుభవాలను కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలు, ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు.
సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి
రెండు రైళ్లలో దోపిడీ
శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ సమీపంలో అర్ధరాత్రి తర్వాత స్వైర విహారం
మహిళా ప్రయాణికుల మెడల్లోని
బంగారు అభరణాలు, బ్యాగుల
అపహరణ
భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టిన
రైల్వే పోలీసులు