ఖతర్నాక్‌ సుధీర్‌ | - | Sakshi
Sakshi News home page

ఖతర్నాక్‌ సుధీర్‌

Nov 11 2023 12:06 AM | Updated on Nov 11 2023 11:54 AM

పోలీసులు అరెస్ట్‌ చేసిన సుధీర్‌ (ముసుగులో ఉన్న వ్యక్తి) - Sakshi

పోలీసులు అరెస్ట్‌ చేసిన సుధీర్‌ (ముసుగులో ఉన్న వ్యక్తి)

నెల్లూరు(క్రైమ్‌): ప్రజల అత్యాశ, బలహీనతలే అతని పెట్టుబడి.. పెద్దగా చదువుకోకపోయినప్పటికీ వివిధ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. సీజన్‌ను బట్టి నోట్ల మార్పిడి, తక్కువ ధరకే బంగారం, నకిలీ పోలీసుల ముసుగులో నేరాలు, మోసాలకు పాల్పడతాడు. మోసపోయిన బాధితులు తాము ఇచ్చిన నగదు ఇవ్వాలని అడిగితే భౌతికదాడులకు పాల్పడుతూ చంపుతామని బెదిరిస్తాడు. అతడే ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు, ఘరానా మోసగాడు దేవరకొండ సుధీర్‌ అలియాస్‌ అజయ్‌రెడ్డి. ఇతను ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

పోలీసుల వివరాల మేరకు.. కావలి తుఫాన్‌నగర్‌కు చెందిన సుధీర్‌ తన స్నేహితులతో గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మార్కెట్‌ ధర కన్నా తక్కువ ధరకు బంగారం, నోట్ల మార్పిడి పేరిట రాష్ట్రంతోపాటు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోనూ మోసాలకు పాల్పడుతూ రూ.కోట్లకు పడగలెత్తాడు. మోసపోయిన బాధితులు తామిచ్చిన నగదు ఇవ్వాలని ప్రశ్నిస్తే భౌతికదాడులకు పాల్పడడంతోపాటు చంపుతామని బెదిరింపు చర్యలకు దిగుతుండడంతో అనేక మంది మిన్నకుండిపోయారు. గతంలో ఒకరిద్దరు ఫిర్యాదు చేయగా పోలీసులు అతనిని అరెస్ట్‌ చేశారు. జైలుకు వెళ్లినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. తిరిగి యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. నకిలీ పోలీసుల ముసుగులో నేరాలకు పాల్పడడం ఈ గ్యాంగ్‌ ప్రత్యేకత.

2013 నుంచి..
సుధీర్‌ గ్యాంగ్‌ 2013 నుంచి మోసాలకు పాల్పడుతూనే ఉంది. మార్కెట్‌ ధర కన్నా తక్కువ ధరకే బంగారం ఇస్తామని గ్యాంగ్‌ సభ్యులతోపాటు తెలిసిన వారి ద్వారా ప్రచారం చేయిస్తారు. ఎవరైనా అతనిని సంప్రదిస్తే మార్కెట్‌లో కేజీ రూ.50 లక్షలు ఉండగా తాను రూ.35 లక్షలకు ఇస్తానని చెప్పి తొలిసారి చెప్పిన విధంగానే బంగారం అందజేసి నమ్మకాన్ని సంపాదించుకుంటాడు. దీంతో అత్యాశకుపోయి కేజీల్లో బంగారం కావాలని అతనిని సంప్రదించడమే తరువాయి.. డబ్బు తీసుకుని చైన్నెలో బంగారం ఇస్తామని వారిని తన వెంట తీసుకెళతాడు. చైన్నెలో ఓ మనిషిని అప్పచెప్పి అతని వద్ద బంగారం ఉందని మీ ఇంటికి చేరుస్తారని నమ్మబలికించి అతనిని వారి వెంట రైలులో ఎక్కిస్తారు.

రైలు కొద్దిదూరం వెళ్లిన అనంతరం నకిలీ పోలీసుల అవతారమెత్తి రైలులో బంగారంతో ఉన్న మనిషిని అరెస్ట్‌ చేసి తమ వెంట తీసుకెళతారు. పోలీసులను చూడగానే బాధితులు ఎక్కడ తమను అరెస్ట్‌ చేస్తారోనని మిన్నకుండిపోతున్నారు. ఇలా పదుల సంఖ్యలో అనేక మందిని సుధీర్‌ గ్యాంగ్‌ మోసగించి రూ.కోట్లు కాజేసింది. నోట్ల రద్దు సమయంలో రూ.కోటికి రూ.75 లక్షలు ఇస్తామని నమ్మించింది. తొలిసారి నగదు ఇచ్చిన వారికి ముందస్తుగా చెప్పిన విధంగానే నగదు ఇచ్చి నమ్మకం కలిగేలా చేస్తారు. దీంతో అత్యాశకు పోయి ఎవరైనా పెద్ద మొత్తంలో నగదు మార్పిడి కోసం ఇస్తే ఇట్టే మోసగించి నగదుతో ఉడాయిస్తారు. తామిచ్చిన నగదును ఇవ్వాలని కోరితే ఎయిర్‌గన్‌లను చూపి చంపుతామని బెదిరిస్తున్నారు.

తాజాగా రూ.2 వేల నోట్లు రద్దు నేపథ్యంలో మోసాలకు తెరలేపారు. రూ.35 లక్షలు ఒరిజినల్‌ నగదు ఇస్తే రూ.కోటి దొంగనోట్లు ఇస్తామని నమ్మించి పలువురిని మోసగించారన్న ఆరోపణలు ఉన్నాయి. విలాసవంతమైన సుధీర్‌ ఇల్లు, అతని వ్యవహారశైలి, చుట్టూ మందీమార్బలం తదితరాలను చూసి ఎందరో మోసపోయారని పోలీసుల దర్యాప్తులో తేలింది. సుధీర్‌ మోసాల్లో శివకుమార్‌రెడ్డి అలియాస్‌ మహేంద్రరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని విచారణలో వెలుగులోకి వచ్చింది. దేవరకొండ సుధీర్‌పై కావలి, తోటపల్లిగూడూరు, గుడ్లూరు, గుంటూరు, చీరాల ఇలా రాష్ట్రవ్యాప్తంగా 25 కేసులు ఉన్నాయి. నిందితుడిపై 2013లో కావలి రెండో పట్టణ పోలీసులు సస్పెక్టెడ్‌ షీట్‌ తెరిచారు.

డ్రైవర్‌పై దాడి ఘటనతో..
కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనతో సుధీర్‌ గ్యాంగ్‌పై ఎస్పీ డాక్టర్‌ కె.తిరుమలేశ్వరరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గ్యాంగ్‌ పలు మోసాలకు పాల్పడినట్లు ఎస్పీ దృష్టికి రావడంతో సుధీర్‌ బాధితులు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. ఎస్పీ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాధితులు ఫిర్యాదులు చేసేందుకు ముందుకు వస్తున్నారు. స్పందన కార్యక్రమంలో సుధీర్‌ గ్యాంగ్‌ మోసాలపై విజయవాడకు చెందిన ప్రవీణ్‌కుమార్‌, గుంటూరుకు చెందిన ప్రీతి సృజన, పి.నరసింహులు, విజయలక్ష్మి, ఎ.సుధీర్‌, భీమవరానికి చెందిన కె.నారాయణదాస్‌, ఈపూరు వెంకన్నపాళేనికి చెందిన చిన్న అంజేలు, తెలంగాణ రాష్ట్రం జగిత్యాలకు చెందిన రాజేష్‌ ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డికి ఫిర్యాదులు చేశారు. ఈ మోసాలపై సైతం పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.

బాధితులూ.. ఫిర్యాదు చేయండి
ఈజీ మనీ కోసం ప్రజలు మోసగాళ్ల వలలో పడొద్దు. దేవరకొండ సుధీర్‌తోపాటు గ్యాంగ్‌లోని ఏడు మందిని ఇప్పటివరకు అరెస్ట్‌ చేశాం. సుధీర్‌ గ్యాంగ్‌ బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా ఫిర్యాదు చేయండి. ఈ కేసును క్షేత్రస్థాయిలో మరింత దర్యాప్తు చేస్తున్నాం.

– కె.తిరుమలేశ్వరరెడ్డి, ఎస్పీ

సుధీర్‌ ఇంట్లో దొరికిన మారణాయుధాలు, వాకీటాకీలు 1
1/2

సుధీర్‌ ఇంట్లో దొరికిన మారణాయుధాలు, వాకీటాకీలు

సుధీర్‌ ఇంట్లో అధునాతన హంగులతో గది 2
2/2

సుధీర్‌ ఇంట్లో అధునాతన హంగులతో గది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement