బుచ్చిరెడ్డిపాళెం: ధాన్యం లోడు లారీతో డ్రైవర్ పరారైన ఘటన గురువారం వెలుగు చూసింది. ఎస్సై వీరప్రతాస్ కథనం మేరకు.. బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన శంకర్ వరప్రసాద్ అనే వ్యక్తి ఽలారీల సప్లైతోపాటు ధాన్యం బ్రోకర్‌గా పని చేస్తున్నాడు. తన వద్ద ఉన్న ధాన్యం లోడు లారీకి డ్రైవర్ లేకపోవడంతో స్నేహితుడైన కృష్ణయ్యకు ఫోన్ చేశాడు. డ్రైవర్ కావాలని కోరాడు. దీంతో కృష్ణయ్య ఓ డ్రైవర్‌ను శంకర్‌వరప్రసాద్ వద్దకు పంపాడు. ఈనెల 24వ తేదీన అతడికి వరప్రసాద్ ధాన్యం లోడు లారీని అప్పగించి, అడ్వాన్స్ కింద రూ.22 వేలు ఇచ్చాడు. ధాన్యాన్ని మండపేట వద్ద దించాలన్నాడు. అయితే 29వ తేదీ వరకు కూడా లారీ రాకపోవడంతో మండపేటలో ధాన్యం కొనుగోలు చేసిన వ్యక్తులు ఫోన్ చేసి శంకర్ వరప్రసాద్‌కు తెలిపారు. దీంతో డ్రైవర్ తమను మోసం చేసి పరారైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా లారీ గుంటూరు ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు.


