
పసికూన జింబాబ్వే చేతిలో శ్రీలంక జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 6) జరిగిన రెండో మ్యాచ్‌లో జింబాబ్వే శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జింబాబ్వే బౌలర్ల ధాటికి 17.4 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వేపై ఓ ఐసీసీ ఫుల్ మెంబర్ జట్టుకు ఇదే అత్యల్ప స్కోర్.
అనంతరం 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు జింబాబ్వే సైతం ఇబ్బంది పడినా.. ఎలాగోలా 14.2 ఓవర్లలో సగం వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో జింబాబ్వే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ కొట్టింది. తొలి టీ20లో శ్రీలంక విజయం సాధించింది.
చెలరేగిన జింబాబ్వే బౌలర్లు
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే ఆది నుంచే శ్రీలంక బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. ప్రతి ఒక్క బౌలర్ లంక ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. సికందర్ రజా (4-0-11-3), బ్రాడ్ ఈవాన్స్ (2.4-0-15-3), ముజరబానీ (3-0-14-2), సీన్ విలియమ్స్ (4-0-19-1) అత్యుత్తమంగా రాణించారు. లంక ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరిలో కమిల్ మిషారా (20) టాప్ స్కోరర్ కాగా.. అసలంక 18, షకన 15 పరగులు చేశారు.
చమటోడ్చిన జింబాబ్వే
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు జింబాబ్వే తీవ్రంగా శ్రమించింది. 81 పరుగులను ఛేదించేందుకు ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయి 14.2 ఓవర్లు తీసుకుంది. చమీరా (4-0-19-3), తీక్షణ (4-0-28-1), బినుర ఫెర్నాండో (3-0-14-1) జింబాబ్వే బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అయినా ర్యాన్ బర్ల్ (20 నాటౌట్), తషింగ ముసేకివా (21 నాటౌట్) నిలకడగా ఆడి జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు. సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20 సెప్టెంబర్ 7న జరుగనుంది.