Zaheer Khan:'సమస్య మళ్లీ మొదటికే.. పరిష్కారం చూపకుంటే ప్రమాదం'

Zaheer Khan Sends India Warning Over 2019 World Cup Problem Repeats - Sakshi

భారత మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌ టీమిండియా క్రికెట్‌ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కీలకమైన వన్డే వరల్డ్‌కప్‌కు ముందు అయ్యర్‌ గాయపడడం.. అవకాశమిచ్చిన సూర్యకుమార్‌ వరుసగా విఫలం కావడం 2019 ప్రపంచకప్‌ సీన్‌ను రిపీట్‌ చేస్తుందన్నాడు. వన్డేల్లో కీలకమైన నాలుగో స్థానంలో కచ్చితమైన పరిష్కారం చూపెట్టకపోతే ప్రమాదం పొంచి ఉందంటూ పేర్కొన్నాడు. జహీర్‌ ఖాన్‌ మాట్లాడుతూ..

''మెగా ఈవెంట్‌ జరిగి నాలుగేళ్లు ముగిసింది. ఈ నాలుగేళ్లలో నాలుగో స్థానం కోసం ఎంతోమంది పోటీ పడ్డారు. ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో మరో వరల్డ్‌కప్‌ జరగనుంది. కానీ సమస్య మాత్రం అలాగే ఉంది. బ్యాటింగ్‌ ఆర్డర్‌పై కచ్చితంగా మరోసారి సమీక్షించుకోవాలి. మళ్లీ నాలుగో స్థానంలో ఆడే బ్యాటర్‌ని గుర్తించాలి. ఇదే సమస్య 2019 వన్డే ప్రపంచకప్‌ సమయంలో కూడా ఎదురైంది.

నాలుగు సంవత్సరాల తర్వాత కూడా మనం అదే సమస్య గురించి మాట్లాడుకుంటున్నాం. నాలుగో స్థానంలో ఆడించేందుకు శ్రేయాస్‌ అయ్యర్‌ను గుర్తించారని నాకు తెలుసు. అతను ఆ బాధ్యతను కూడా చక్కగా నిర్వర్తించాడు. కానీ అయ్యర్‌ ప్రస్తుతం గాయం బారిన పడ్డాడు. ఒకవేళ అయ్యర్‌ గాయం నుంచి కోలుకోకపోతే ఈ సమస్య నుంచి బయటపడడానికి పరిష్కార మార్గాలను వెతకాల్సిన అవసరం ఉంటుంది'' అని జహీర్‌ ఖాన్‌ చెప్పుకొచ్చాడు.

ఇక అక్టోబర్‌-నవంబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆతిధ్యమివ్వనుంది. సొంతగడ్డపై మెగాటోర్నీ జరగనుండడంతో టీమిండియా ఫెవరెట్‌ హోదాలో బరిలోకి దిగనుంది. 12 ఏళ్ల క్రితం భారత్‌లోనే జరిగిన వన్డే ప్రపంచకప్‌ను ధోని సారధ్యంలోని టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అభిమానుల కలను నెరవేర్చింది. తాజాగా మరోసారి వన్డే ప్రపంచకప్‌ జరగనుండడంతో ఈసారి కూడా అదే ఆసక్తి నెలకొంది.

అయితే ప్రస్తుతం జట్టు పరిస్థితి చూస్తే అనుకున్నంత మెరుగ్గా లేదు. ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌ అందుకు నిదర్శనం. ముఖ్యంగా బ్యాటింగ్‌లో టీమిండియా చాలా మెరుగుపడాల్సి ఉంది. రోహిత్‌, గిల్‌, కోహ్లిలు రాణించాల్సిన అవసరం ఉంది. మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌/శ్రేయాస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్ కూడా అంతంత మాత్రంగానే ఆడుతున్నారు. ఇక ఆల్‌రౌండర్‌ జడేజా వన్డేల్లో తన ముద్ర చూపించాల్సిన అవసరం ఉంది. షమీ, సిరాజ్‌, కుల్దీప్‌లతో బౌలింగ్‌ మాత్రం కాస్త పటిష్టంగానే కనిపిస్తుంది. వరల్డ్‌కప్‌ సమయానికి వీరికి బుమ్రా జత కలిస్తే మాత్రం బౌలింగ్‌లో భారత్‌కు తిరుగుండదు.

చదవండి: బ్యాటర్‌ కొంపముంచిన బంతి.. వీడియో వైరల్‌

NZ Vs SL: పాపం రచిన్‌ రవీంద్ర! షిప్లే విశ్వరూపం.. 10 ఓవర్లలోనే లంక..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top