NZ Vs SL 1st ODI: పాపం రచిన్‌ రవీంద్ర! షిప్లే విశ్వరూపం.. 10 ఓవర్లలోనే లంక..

NZ Vs SL 1st ODI: Rachin Ravindra Misses 50 On Debut With 1 Run - Sakshi

New Zealand vs Sri Lanka, 1st ODI: శ్రీలంకతో తొలి వన్డేలో న్యూజిలాండ్‌ మెరుగైన స్కోరు నమోదు చేయగలిగింది. ఆక్లాండ్‌ వేదికగా శనివారం నాటి మ్యాచ్‌లో 274 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ అర్ధ శతకంతో రాణించగా.. అరంగేట్ర ఆటగాడు రచిన్‌ రవీంద్ర తృటిలో హాఫ్‌ సెంచరీ చేజార్చుకున్నాడు.

కాగా సొంతగడ్డపై లంకతో టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన న్యూజిలాండ్‌ పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 8 వరకు వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ క్రమంలో ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌లో ఇరు జట్ల మధ్య మొదటి వన్డేలో టాస్‌ గెలిచిన పర్యాటక శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ ఆరంభంలోనే అరంగేట్ర ఓపెనర్‌ చాడ్‌ బౌస్‌(14 పరుగులు) వికెట్‌ కోల్పోగా.. మరో ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విల్‌ యంగ్‌(26)తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు.

పాపం రచిన్‌ రవీంద్ర
ఇక నాలుగో స్థానంలో వచ్చిన డారిల్‌ మిచెల్‌ 47 పరుగులతో ఆకట్టుకోగా.. కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌(5)విఫలమయ్యాడు. గ్లెన్‌ ఫిలిప్స్‌ 39 పరుగులు సాధించగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర మెరుగైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 52 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 49 పరుగులు చేసిన అతడు.. ఒక్క పరుగు తేడాతో అరంగేట్రంలోనే హాఫ్‌ సెంచరీ చేసే అవకాశం చేజార్చుకున్నాడు. కసున్‌ రజిత బౌలింగ్‌లో షనకకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 

షిప్లే విశ్వరూపం
ఈ క్రమంలో 49.3 ఓవర్లలో కివీస్‌ 274 పరుగులు చేయగలిగింది. లంక బౌలర్లలో చమిక కరుణరత్నె అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. కసున్‌ రజిత రెండు, లాహిరు కుమార రెండు, కెప్టెన్‌ దసున్‌ షనక ఒకటి, దిల్షాన్‌ మధుషంక ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

లక్ష్య ఛేదనకు దిగిన లంకను కివీస్‌ పేసర్‌ షిప్లే అల్లాడిస్తున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి షిప్లే నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఓపెనర్‌ నవనీడు ఫెర్నాండో రనౌట్‌ రూపంలో వెనుదిరగడంతో లంక మొత్తంగా ఐదు వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది.

చదవండి: Ben Stokes: అడుగుపెట్టిన కాసేపటికే బరిలోకి.. బ్యాట్‌తో విధ్వంసం
IPL 2023: ఏకకాలంలో బ్యాటింగ్‌, బౌలింగ్‌.. ధోనికి మాత్రమే సాధ్యం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top