సచిన్‌ కొడుకు కోసం అశ్విన్‌పై ఫైర్‌ అయిన యువరాజ్‌ సింగ్‌ తండ్రి | Yograj Singh Declares War With Sachin Tendulkar’s Teammate For Son Arjun Tendulkar | Sakshi
Sakshi News home page

సచిన్‌ కొడుకు కోసం అశ్విన్‌పై ఫైర్‌ అయిన యువరాజ్‌ సింగ్‌ తండ్రి

Mar 25 2026 7:08 PM | Updated on Mar 25 2026 7:17 PM

Yograj Singh Declares War With Sachin Tendulkar’s Teammate For Son Arjun Tendulkar

మాజీ భారత డాషింగ్‌ బ్యాటర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ మరోసారి వార్తల్లోకెక్కాడు. కొడుకు సహచరులపై తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే యోగ్‌రాజ్‌ ఈసారి దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సహచరుడు, భారత స్పిన్‌ కింగ్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను టార్గెట్‌ చేశాడు. యోగ్‌రాజ్‌ అశ్విన్‌పై ఫైరవ్వడానికి సచిన్‌ కొడుకు అర్జున్‌ టెండూల్కర్‌ కారణం.

అర్జున్‌ 2022లో యోగ్‌రాజ్‌ వద్ద శిక్షణ తీసుకున్నాడు. అప్పటి నుంచే అర్జున్‌ దశ మారింది. ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌తో పాటు రంజీ ట్రోఫీలో గోవాకు మారి సత్తా చాటడం ప్రారంభించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలంలో అర్జున్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది.

ఈ సీజన్‌లో అర్జున్‌కు లక్నో తుది జట్టులో చోటు లభించడంపై ఇటీవల అశ్విన్‌ కాస్త ఓపెన్‌గా మాట్లాడాడు. అర్జున్‌కు తుది జట్టులో చోటు దక్కడం అసాధ్యమని అన్నాడు. ఈ మాటలే యోగ్‌రాజ్‌ను చిర్రెత్తిపోయేలా చేశాయి. టీవీల్లో కూర్చొని ఒకరి ఫేట్‌ను డిసైడ్‌ చేయడానికి నువ్వ ఎవరు.. నీ అర్హత ఏంటి అంటూ ఘాటుగా స్పందించాడు. 

ఓ ఆటగాడిని నువ్వు చేయలేవు.. ఇది సాధ్యం కాదు అని మాట్లాడటం సరైంది కాదంటూ అశ్విన్‌కు చురకలంటించాడు. ఇలా మాట్లాడటం ఏ ఆటగాడిపై అయినా ఒత్తిడి పెంచుతుందని అన్నాడు. సచిన్‌ కొడుకు కావడం అర్జున్‌పై ముందు నుంచే ఒత్తిడి ఉంది.. ఇలాంటి వ్యాఖ్యలు అతన్ని మరింత ఒత్తిడిలోకి నెడతాయని తెలిపాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అర్జున్‌కు తప్పక అవకాశాలు వస్తాయి.. వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటాడని యోగ్‌రాజ్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు.

కాగా, యోగ్‌రాజ్‌ కొంతకాలం కిందట, అర్జున్‌ తన వద్ద ఆరు నెలలు శిక్షణ తీసుకుంటే ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్‌ అవుతాడని జోస్యం చెప్పాడు. అలా జరగకపోతే తాను గడ్డం కత్తరించుకుంటానని ఛాలెంజ్‌ కూడా చేశాడు. యోగ్‌రాజ్‌ చెప్పనట్లుగానే.. అతని వద్ద 12 రోజుల శిక్షణ తీసుకున్న తర్వాత అర్జున్ ఫేట్‌ మారిపోయింది. రంజీ ట్రోఫీలో కొత్తగా గోవా తరఫున, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కాంట్రాక్ట్‌ లభించాయి. ఈ అవకాశాలను అర్జున్‌ పెద్దగా సద్వినియోగం చేసుకోలేకపోయినా,  అభిమానుల చూపును తనవైపు మళ్లించుకోగలిగాడు.

అశ్విన్‌ వ్యాఖ్యలను తప్పుబట్టడానికి వీల్లేదు..!
ఈ సీజన్‌లో లక్నో బౌలింగ్‌ విభాగం చాలా బలంగా ఉంది. మొహమ్మద్ షమీ, అన్రిచ్ నోర్జే, అవేశ్ ఖాన్, మోహ్సిన్ ఖాన్ వంటి నాణ్యమైన పేసర్లు జట్టులో ఉన్నారు. వీరిని కాదని అర్జున్‌కు తుది జట్టులో చోటు దక్కడం ప్రాక్టికల్‌ సాధ్యం కాకపోవచ్చు. అయినా, యోగ్‌రాజ్‌ అర్జున్‌పై నమ్మకం వ్యక్తం చేయడం ఆసక్తికరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement