ఆస్ట్రేలియా ఆజానుబాహుడికి బంపరాఫర్‌ | CSK sign Spencer Johnson as replacement for Ellis | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా ఆజానుబాహుడికి బంపరాఫర్‌

Mar 25 2026 5:30 PM | Updated on Mar 25 2026 6:58 PM

CSK sign Spencer Johnson as replacement for Ellis

ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌లో (CSK) కీలక మార్పు చోటు చేసుకుంది. నాథన్‌ ఇల్లిస్‌ గాయంతో సీజన్‌ మొత్తానికి దూరం కావడంతో, అతని స్థానంలో మరో ఆస్ట్రేలియా పేసర్‌ స్పెన్సర్ జాన్సన్‌ జట్టులో చేరాడు. ఎడమ చేతి వాటం పేసర్‌ అయిన జాన్సన్‌ను సీఎస్‌కే రూ. 1.5 కోట్లకు సొంతం​ చేసుకుంది.

జాన్సన్‌కు ఇదివరకే ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉంది. 2024లో గుజరాత్ టైటాన్స్ అతన్ని రూ. 10 కోట్ల భారీ బిడ్‌తో దక్కించుకుంది. ఆ తర్వాత 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన జాన్సన్‌.. ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. అతని ఎకానమీ రేట్ (10.39) చాలా దారుణంగా ఉంది. అయినా, సీఎస్‌కే అతన్ని తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

జాన్సన్‌కు ఐపీఎల్‌లో మంచి రికార్డు లేకపోయినా, ఆస్ట్రేలియా తరఫున ఓ మోస్తరు రికార్డు ఉంది. ఆసీస్‌ తరఫున అతను 8 టీ20ల్లో 14 వికెట్లు, 5 వన్డేల్లో 4 వికెట్లు తీశాడు. ఈ ఐపీఎల్‌ ఆఫర్‌కు ముందు జాన్సన్‌కు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌ నుంచి భారీ ఆఫర్‌ వచ్చింది. 

గ్లాడియేటర్స్‌ ఇతన్ని నేరుగా సంతకం చేసుకున్నా, వ్యక్తిగత కారణాలతో అతను ఆ లీగ్‌ నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఐపీఎల్‌ నుంచి బంపర్‌ ఆఫర్‌ రావడంతో అన్నీ పక్కకు పెట్టి ఓకే చెప్పేశాడు. ఆజానుబాహుడైన జాన్సన్‌ బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగలడు.

కాగా, ఐపీఎల్‌ 2026లో సీఎస్‌కే ప్రయాణం మార్చి 30 నుంచి మొదలవుతుంది. గౌహతిలొ జరిగే మ్యాచ్‌లో సీఎస్‌కే రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడుతుంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌ మార్చి 28న ఆర్సీబీ-సన్‌రైజర్స్‌ మ్యాచ్‌తో మొదలవుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. 

ఐపీఎల్‌-2026లో సీఎస్‌కే జట్టు
ఎంఎస్‌ ధోని (వికెట్‌ కీపర్‌), అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్, సంజూ శాంసన్ (ట్రేడింగ్‌ ద్వారా, వికెట్‌ కీపర్‌), గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ముఖేష్ చౌదరి, శివమ్ దూబే, ఆయుష్ మాత్రే, స్పెన్సర్‌ జాన్సన్‌ , శ్రేయాస్ గోపాల్, ఉర్విల్ పటేల్‌ (వికెట్‌ కీపర్‌), ఖలీల్‌ అహ్మద్‌, అకీల్‌ హొసేన్‌, ప్రశాంత్‌ వీర్‌, కార్తిక్‌ శర్మ, మాథ్యూ షార్ట్‌, అమన్‌ ఖాన్‌, జాక్‌ ఫౌల్క్స్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, రాహుల్‌ చహర్‌, మ్యాట్‌ హెన్రీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement