బుమ్రాకు సంబంధించి బిగ్‌ న్యూస్‌ | Jasprit Bumrah's IPL 2026 Availability For Mumbai Indians Revealed After CoE Visit | Sakshi
Sakshi News home page

బుమ్రాకు సంబంధించి బిగ్‌ న్యూస్‌

Mar 25 2026 6:24 PM | Updated on Mar 25 2026 8:40 PM

Jasprit Bumrah's IPL 2026 Availability For Mumbai Indians Revealed After CoE Visit

ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండగా.. ముంబై ఇండియన్స్‌ స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు సంబంధించిన ఓ విషయం అభిమానులను తెగ కంగారు పెట్టింది. ఇటీవల బుమ్రా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్ ఎక్సలెన్స్‌కు (CoE) వెళ్లగా.. అతనికి గాయమైందేమోనని ఫ్యాన్స్‌ ఆందోళన చెందారు. 

తాజాగా అలాంటిదేమీ లేదని తేలడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. బుమ్రా కేవలం ఫిట్‌నెస్ చెక్ కోసమే CoE​కి వెళ్లాడని కన్ఫర్మ్‌ అయ్యింది. ప్రస్తుతం బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, తొలి మ్యాచ్‌ నుంచే అందుబాటులో ఉంటాడని స్పష్టమైంది.

కాగా, ఐపీఎల్‌ 2026 సీజన్‌ మార్చి 28 నుంచి ప్రారంభం కానుండగా.. ముంబై ఇండియన్స్‌ తమ తొలి మ్యాచ్‌ను ఆ మరుసటి రోజు (మార్చి 29) ఆడనుంది. వాంఖడేలో జరిగే మ్యాచ్‌లో ఎంఐ.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.

ఇదిలా ఉంటే, గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌​ ఆదిలో వరుస పరాజయాలు ఎదుర్కొన్నా, ఆఖరి మ్యాచ్‌ల్లో అనూహ్యంగా పుంజుకొని ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది (నాలుగో స్థానం). అయితే క్వాలిఫయర్-2లో పంజాబ్‌ కింగ్స్‌ చేతుల్లో ఓడి లీగ్‌ నుంచి నిష్క్రమించింది. 

బుమ్రా రాకతో మారిన ఫేట్‌
గత ఎడిషన్‌లో బుమ్రా తొలి నాలుగు మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం ముంబై ఇండియన్స్‌ను చాలా ప్రభావితం చేసింది. బుమ్రా రాకతో ఎంఐ తిరిగి గాడిలో పడి క్వాలిఫయర్‌-2 వరకు చేరింది. ఆ సీజన్‌లో బుమ్రా 12 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్‌కు జీవం పోశాడు. 

ఊరిస్తున్న ఆరో టైటిల్‌
తాజాగా బుమ్రా భారత్‌ తరఫున టీ20 వరల్డ్‌కప్‌లోనూ అద్భుత ప్రదర్శనలు చేసి జోరుమీదున్నాడు. బుమ్రా ఫామ్‌ ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌కు ఆరో ఐపీఎల్‌ ట్రోఫీని ఊరిస్తుంది. బుమ్రా తన సామర్థ్యం మేరకు రాణించగలిగితే ఈ సీజన్‌లోనూ ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కు తప్పక చేరుతుంది. 

ఉరకలేస్తుంది..!
ఈ సీజన్‌లో హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్‌ యువకులు, అనుభవజ్ఞులతో ఉరకలేస్తుంది. తాజాగా భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ అందించిన సూర్యకుమార్‌ యాదవ్‌, ఆ జట్టులో సభ్యులైన తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, జస్ప్రీత్‌ బుమ్రా ఇదే జట్టులో ఉన్నారు. వీరికి వెటరన్‌ డాషింగ్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ కూడా తోడున్నాడు. 

వారి ప్రదర్శనల కోసం ఎదురుచూపు..!
వీరు కాకుండా ఈ సీజన్‌తోనే ముంబై ఇండియన్స్‌ పంచన చేరిన షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌, విల్‌ జాక్స్‌ లాంటి భారీ హిట్టర్ల ప్రదర్శనల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement