న్యూజిలాండ్‌కు సొంతగడ్డపై పరాభవం ఎదురైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పర్యాటక సౌతాఫ్రికా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా ఇవాళ (మార్చి 25) జరిగిన నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌లో సఫారీ జట్టు 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నాలుగో నంబర్ ఆటగాడు, వికెట్ కీపర్ బ్యాటర్ కానర్ ఎస్టర్‌హ్యూజన్ (33 బంతుల్లో 75; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
మిగతా ఆటగాళ్లలో వియాన్ ముల్దర్ (31), రూబిన్ హెర్మన్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఖర్లో డియాన్ ఫార్రెస్టర్ (21 నాటౌట్; ఫోర్, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. టోని డి జోర్జి (12) నిరాశపర్చగా.. జేసన్ స్మిత్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్ సియర్స్ 2, జకరీ ఫౌల్క్స్, జోష్ క్లార్క్‌సన్ తలో వికెట్ తీశారు.
అనంతరం 188 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. సఫారీ బౌలర్ల ధాటికి తడబడింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేసి పరాజయంపాలైంది. గెరాల్డ్ కొయెట్జీ, వియాన్ ముల్దర్, ఓట్నీల్ బార్ట్‌మన్ తలో 2, కెప్టెన్ కేశవ్ మహారాజ్ ఓ వికెట్ తీసి న్యూజిలాండ్‌ను కట్టడి చేశారు. వికెట్లు తీయకపోయినా ప్రెనెలన్ సుబ్రాయెన్ (4-0-22-0) అద్బుతంగా బౌలింగ్ చేశాడు.
కివీస్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 36 పరుగులతో బెవాన్ జాకబ్స్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టిమ్ రాబిన్సన్ 25, డేన్ క్లీవర్ 22, నిక్ కెల్లీ 14, కేటీన్ క్లార్క్ 2, కెప్టెన్ జిమ్మీ నీషమ్ 24, జోష్ క్లార్క్‌సన్ 13, కోల్ మెక్‌కోంచి 1, జకరీ ఫౌల్క్స్, కైల్ జేమీసన్ తలో 4 పరుగులతో అజేయంగా నిలిచారు.
మరో క్లాసెస్ దొరికాడు..!
ఈ సిరీస్‌తో సౌతాఫ్రికాకు మరో క్లాసెన్ దొరికాడు. క్లాసెన్ లాగే వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన కానర్ ఎస్టర్‌హ్యూజన్ విధ్వంసకర బ్యాటింగ్ శైలితో క్లాసెన్‌కు తలపించాడు. కానర్ వికెట్ల వెనకాల కూడా పర్వాలేదనిపించాడు. నేటి మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో తన జట్టుకు సిరీస్ విజయాన్ని అందించిన కానర్.. దీనికి ముందు మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో చెలరేగాడు.
ఆ మ్యాచ్‌లో 36 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. ఇదే సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కానర్.. 5 మ్యాచ్‌ల్లో 145కు పైగా స్ట్రయిక్ రేట్‌తో 200 పరుగులు చేశాడు. తద్వారా ఐదో టీ20లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. క్లాసెన్ రిటైరయ్యాక సౌతాఫ్రికాకు ఆ స్థాయి బ్యాటర్‌గా కానర్ గుర్తింపు తెచ్చుకున్నాడు.


