
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో యూపీ యోధాస్ జోరు పెంచుతోంది. ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ 34–31తో మూడుసార్లు చాంపియన్ అయిన పట్నా పైరేట్స్‌ను కంగుతినిపించింది. ఆట ఆరంభంలో పైరేట్స్ పైచేయి కనబరిచింది. మొదటి పది నిమిషాలైతే చకచకా పాయింట్లు రాబట్టిన పట్నా 7–6తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత యూపీ యోధాస్ ఆటగాళ్లు సమష్టిగా రాణించడంతో పట్నా వెనుకబడింది. రెయిడర్లలో గగన్ గౌడ 7 పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో భవాని రాజ్‌పుత్, శివమ్ చెరో 5 పాయింట్లు చేశారు.
డిఫెండర్లలో కెప్టెన్ సుమిత్, అశు సింగ్ తలా 5 పాయింట్లు సాధించారు. పట్నా పైరేట్స్ జట్టులో రెయిడర్లు అయాన్ (9) మణిందర్ సింగ్ (7) రాణించారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ పుణేరి పల్టన్ 41–19తో గుజరాత్ జెయంట్స్‌పై అలవోక విజయం సాధించింది. రెయిడింగ్ లో ఆదిత్య షిండే (6), పంకజ్ (5), డిఫెండర్లలో అభినేశ్ (6), గౌరవ్ ఖత్రి (4) అద్భుతంగా ఆడారు. ఆల్‌రౌండర్లు అస్లామ్ (5), గుర్దీప్ (4)లు కూడా మెరుగ్గా రాణించడంతో పుణేరి జట్టు క్రమం తప్పకుండా పాయింట్లు సాధించింది. గుజరాత్ తరఫున రెయిడర్ రాకేశ్ (6) మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి.