Wrestlers MeToo Protest: పట్టు విడువని రెజ్లర్లు.. చర్యలు చేపట్టిన కేంద్రం.. నిరసన విరమణ

Wrestlers Protest Against WFI Chief Brij Bhushan Called Off - Sakshi

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ను తొలగించడం సహా డిమాండ్లన్నీ పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రెజర్లు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత తమ ధర్నాను విరమించారు. ‘‘రెజ్లర్ల ఆరోపణలపై ఓవర్‌సైట్‌ కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ డబ్ల్యూఎఫ్‌ఐ, దాని చీఫ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా చర్యలు ఉంటాయి’’ అని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. 

ఇదిలాఉండగా.. ‘దంగల్‌’లో దిగితే ప్రత్యర్థుల పట్టుపట్టే రెజ్లర్లు అదే జోరుతో ధర్నాతో హడలెత్తించి.. డిమాండ్లు సాధించుకున్నారు. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)లో ఏళ్ల తరబడి తిష్టవేసుకొని లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను గద్దె దించేదాకా ధర్నా విరమించబోమని స్టార్‌ రెజ్లర్లు వినేశ్‌ ఫొగాట్, సాక్షి మలిక్, రవి దహియా, బజరంగ్‌ పూనియా, దీపక్‌ పూనియా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తమ ప్రాణాలకు ముప్పున్నా వెరువమని, అన్నింటికి సిద్ధపడే న్యాయ పోరాటానికి దిగామని చెప్పారు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిని తొలగించడంతో పాటు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని వారంతా పట్టుబట్టడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

మరోవైపు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలన్న రెజ్లర్ల డిమాండ్‌కు అనుగుణంగా ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష వ్యవహరించారు. అత్యవసర భేటీ నిర్వహించి ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి న్యాయం చేస్తానని ఉష హామీ ఇచ్చారు.   

మేరీకోమ్‌ నేతృత్వంలో కమిటీ...
లైంగిక ఆరోపణల వ్యవహారంపై దర్యాప్తు చేయాలన్న  స్టార్‌ రెజ్లర్ల డిమాండ్‌పై భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) స్పందించింది. అథ్లెట్‌ దిగ్గజం పీటీ ఉష నేతృత్వంలోని ఐఓఏ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఈసీ) సభ్యులు శుక్రవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషతో పాటు ఈసీ సభ్యులైన మాజీ షూటర్‌ అభినవ్‌ బింద్రా, యోగేశ్వర్‌ దత్, సంయుక్త కార్యదర్శి కల్యాణ్‌ చౌబే, ప్రత్యేక ఆహ్వానితులుగా శివ కేశవన్‌ ఈ ఉన్నతస్థాయి భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా రెజ్లర్లు చేస్తున్నవి తీవ్రమైన ఆరోపణలు కావడంతో వీటిపై నిగ్గు తేల్చేందుకు దిగ్గజ మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఐఓఏ ప్రకటించింది.   

ఏజీఎం తర్వాతే బ్రిజ్‌భూషణ్‌ స్పందన
గోండా (ఉత్తర ప్రదేశ్‌): తీవ్రస్థాయిలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూ ఎఫ్‌ఐ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ త్వరలోనే ఈ వ్యవహారంపై స్పందిస్తారని ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే ప్రతీక్‌ భూషణ్‌ సింగ్‌ శుక్రవారం మీడియాతో అన్నారు. ‘ఈ నెల 22న డబ్ల్యూఎఫ్‌ఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఇది ముగియగానే అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ తనపై వచ్చిన ఆరోపణలపై లిఖితపూర్వక ప్రకటన విడుదల చేస్తారు’ అని అన్నారు.   

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top