
ఐసీసీ వన్డే ప్రపంచకప్-2027కు ఇంగ్లండ్ జట్టు నేరుగా ఆర్హత సాధిస్తుందా? లేదా క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఆడుతుందా? అన్న చర్చ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో నెలకొంది. ఇటీవల కాలంలో ఇంగ్లండ్ జట్టు దారుణ ప్రదర్శన ఇందుకు కారణం. టీ20, టెస్టుల్లో పర్వాలేదన్పిస్తున్న ఇంగ్లీష్ జట్టు.. వన్డేల్లో మాత్రం పూర్తిగా తెలిపోతుంది.
2019 ఛాంపియన్స్ అయిన ఇంగ్లండ్ ప్రస్తుతం వరుస ఓటములతో సతమతమవుతోంది. తాజాగా గురువారం లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. దీంతో 2-0 తేడాతో బ్రూక్ సేన సిరీస్‌ను కోల్పోయింది. 1998 తర్వాత సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ వన్డే సిరీస్‌ను కోల్పోడం ఇదే తొలిసారి.
డైరెక్ట్ ఎంట్రీ కష్టమే..?
వన్డే ప్రపంచకప్-2023 తర్వాత ఇప్పటివరకు 21 వన్డేలు ఆడిన ఇంగ్లండ్ కేవలం 7 మాత్రమే గెలిచింది. ఈ ఫలితాలు బట్టి వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లండ్ ప్రదర్శన ఎలా ఉందో మనం ఆర్ధం చేసుకోవచ్చు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కూడా ఇంగ్లండ్ గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది.
దీంతో జోస్ బట్లర్ కెప్టెన్సీ తప్పుకొన్నాడు. అతడి స్ధానంలో యువ హ్యారీ బ్రూక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అయినప్పటికి ఇంగ్లీష్ జట్టు తలరాత మారలేదు. ఇప్పుడు సౌతాఫ్రికాతో సిరీస్‌ను కోల్పోవడంతో 2027 వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను ఇంగ్లండ్ సంక్లిష్టం చేసుకుంటుంది.
వన్డే ప్రపంచకప్-2027కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ మెగా టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతీ గ్రూపులో ఏడు జట్లు చొప్పున ఉంటాయి. ఇందులో ఎనిమిది జట్లు ర్యాంకింగ్, మరో రెండు జట్లు ఆతిథ్య హోదాలో ఆర్హత సాధిస్తాయి. మరో నాలుగు జట్లు క్వాలిఫయర్ రౌండ్స్ నుంచి ప్రధాన టోర్నీలో అడుగుపెడతాయి.
ఆతిథ్య హోదాలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఆటోమేటిక్ ఆర్హత సాధిస్తాయి. అయితే నమీబియా ఆతిథ్యమిస్తున్నప్పటికి ఇంకా ఐసీసీ సభ్య దేశం కాకపోవడంతో క్వాలిఫయర్స్ ఆడాల్సిందే.
ఆఖరి స్దానంలో ఇంగ్లండ్..
ఇక ప్రస్తుతానికి ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో టాప్-8లో భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ ఉన్నాయి. సౌతాఫ్రికా ఎలాగో నేరుగా ఆర్హత సాధిస్తుంది కాబట్టి ర్యాంకింగ్‌తో సంబంధం లేదు. అయితే ఇంగ్లండ్ మాత్రం 86 రేటియింగ్ పాయింట్లతో ఎనిమిదో స్ధానంలో ఉంది.
ఇంగ్లండ్ తర్వాతి స్ధానంలో వెస్టిండీస్(80), బంగ్లాదేశ్(77) ఉంది. ఇంగ్లండ్, విండీస్, బంగ్లాదేశ్‌కు మధ్య పెద్దగా రేటింగ్ పాయింట్లు తేడా లేవు. ఇప్పటినుంచి అయినా ఇంగ్లండ్ వన్డేల్లో మెరుగైన ప్రదర్శన చేయకపోతే పదో స్ధానానికి పడిపోతుంది. దీంతో ఇంగ్లీష్ జట్టు క్వాలిఫయర్స్ ఆడాల్సి వుంటుంది.
ఒకవేళ రాబోయో సిరీస్‌లలో విజయాలు సాధిస్తే ఇంగ్లండ్ నేరుగా ఆర్హత సాధిస్తుంది. ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్ న్యూజిలాండ్, శ్రీలంక, భారత్‌తో సిరీస్‌లో ఆడనున్నారు. శ్రీలంకతో రెండు సార్లు వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ తలపడనుంది.
చదవండి: కివీస్ క్రికెట్ దిగ్గజం సంచలన నిర్ణయం.. 41 ఏళ్ల వయసులో రీ ఎంట్రీ.. ఓ ట్విస్ట్