
న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం రాస్ టేలర్ (Ross Taylor) తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు.. తిరిగి పునరాగమనం చేయనున్నాడు. అయితే, ఈసారి న్యూజిలాండ్ తరఫున కాకుండా.. సమోవా (Samoa) జట్టు తరఫున రాస్ టేలర్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడనున్నాడు.
అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా
వెల్లింగ్‌టన్‌కు చెందిన రాస్ టేలర్.. 2006- 2022 వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కివీస్ తరఫున ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. తద్వారా న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
విలియమ్సన్ తర్వాత...
ఇక రాస్ టేలర్ టెస్టుల్లో 7684, వన్డేల్లో 8602, అంతర్జాతీయ టీ20లలో 1909 పరుగులు సాధించాడు. కేన్ విలియమ్సన్ తర్వాత కివీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు.. విలియమ్సన్ తర్వాత టెస్టుల్లో అత్యధిక సెంచరీలు (19) కొట్టిన క్రికెటర్ కూడా అతడే!
సడన్ సర్‌ప్రైజ్
ఇక ఐపీఎల్‌లో 55 మ్యాచ్‌లలో భాగమైన రాస్ టేలర్ 1017 రన్స్ రాబట్టాడు. ఇదిలా ఉంటే.. 2022లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు అతడు గుడ్‌బై చెప్పాడు. అయితే, సోషల్ మీడియా వేదికగా శుక్రవారం సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు టేలర్. తాను సమోవా జట్టు తరఫున ఆడబోతున్నట్లు ప్రకటించాడు.
నా వారసత్వం, సంస్కృతి
‘‘రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నా. ఇది అధికారిక ప్రకటన. సమోవా తరఫున ఆడబోతున్నానని గర్వంగా ప్రకటిస్తున్నా. కేవలం ఇదొక పునరాగమనం మాత్రమే కాదు. నా వారసత్వం, సంస్కృతి, గ్రామాలు, కుటుంబాలకు మరోసారి ప్రాతినిథ్యం వహించడమే.
తిరిగి క్రికెట్ ఆడబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. త్వరలోనే జట్టుతో చేరతా. మైదానంలో, మైదానం వెలుపలా నా అనుభవాలను జట్టుతో పంచుకుంటా’’ అని 41 ఏళ్ల రాస్ టేలర్ ప్రకటించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ క్వాలిఫయర్స్‌లో టేలర్ సమోవాకు ఆడనున్నాడు.
తల్లి తరఫు నుంచి..
రాస్ టేలర్ తల్లి సమోవా మూలాలు కలిగి ఉంది. ఆమె వారసత్వంతోనే టేలర్‌కు సమోవా పాస్‌పోర్టు లభించింది. ఇక నిబంధనల ప్రకారం.. టేలర్ న్యూజిలాండ్‌కు ఆడి మూడేళ్ల కాలం పూర్తైంది. కాబట్టి అతడు జాతీయ స్థాయిలో తను ఎంచుకున్న రెండో జట్టుకు వీలు ఉంటుంది.
ఇదిలా ఉంటే.. రాస్ టేలర్ ప్రాణ స్నేహితుడు, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ తరుణ్ నేతుల సమోవా హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ఫ్రాంఛైజీ క్రికెట్‌లో ఆడుతూ టేలర్ యాక్టివ్‌గానే ఉన్నాడు. ఇక తూర్పు ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్‌కు అర్హత సాధించిన సమోవా.. రాస్ టేలర్ రాకతో కాస్త బలపడింది.
చదవండి: గంభీర్, సెహ్వాగ్, భజ్జీ.. అంతా బాధితులే: ధోనిపై మరోసారి యువీ తండ్రి ఫైర్