World Athletics Championships: జెరుటో జోరు...

World Athletics Championships: Norah Jeruto Wins Womens Steeplechase Title at World Athletics Championships - Sakshi

ఈవెంట్‌ ఆరో రోజు రెండు విభాగాల్లో ఫైనల్స్‌ జరిగాయి. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో నోరా జెరుటో (కజకిస్తాన్‌)కు స్వర్ణం దక్కింది. రేస్‌ను ఆమె 8 నిమిషాల 53.02 సెకన్లలో పూర్తి చేసి కొత్త చాంపియన్‌షిప్‌ రికార్డును నమోదు చేసింది. వెర్కుహ గెటాచూ (ఇథియోపియా – 8 నిమిషాల 54.61 సె.) రజతం సాధించగా, మెకిడెస్‌ అబీబీ (ఇథియోపియా – 8 నిమిషాల 56.08 సె.) కాంస్యం గెలుచుకుంది.

ఈ ఈవెంట్‌లో టాప్‌–3లో నిలిచిన ముగ్గురు అథ్లెట్లు కూడా పరుగును 9 నిమిషాల్లోపే పూర్తి చేయడం వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో తొలి సారి కావడం విశేషం. జూనియర్‌ స్థాయిలో కెన్యాకు ప్రాతినిధ్యం వహించి గత ఏడాది కజకిస్తాన్‌కు వలస వెళ్లిన జెరుటో ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కూడా కోల్పోయింది. అయితే ఇప్పుడు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ బరిలోకి దిగి కజకిస్తాన్‌కు ఈ క్రీడల చరిత్రలో తొలి స్వర్ణాన్ని అందించింది.  

మహిళల డిస్కస్‌త్రోలో టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత వలరీ అల్‌మన్‌ (అమెరికా)కు నిరాశ ఎదురైంది. డిస్క్‌ను 68.30 మీటర్లు విసిరిన అల్‌మన్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకుంది. చైనాకు చెందిన బిన్‌ ఫింగ్‌ స్వర్ణం గెలుచుకుంది. 69.12 మీటర్లతో ఆమె అగ్ర స్థానంలో నిలిచింది. సాండ్రా పెర్కోవిక్‌ (క్రొయేషియా – 68.45 మీ.)కు రజతం దక్కింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top