Womens T20 WC 2023 IND VS PAK: పాక్‌ను మట్టికరిపించిన భారత్‌.. టీ20 వరల్డ్‌కప్‌లో బోణీ విక్టరీ

Womens T20 WC: IND VS PAK Highlights And Updates - Sakshi

పాక్‌ను మట్టికరిపించిన భారత్‌.. టీ20 వరల్డ్‌కప్‌లో బోణీ విక్టరీ
మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా బోణీ విక్టరీ నమోదు చేసింది. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత్‌.. తమ తొలి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. కెప్టెన్‌ మారూఫ్‌ (68 నాటౌట్‌), అయేషా నసీం (43 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్‌.. షెఫాలీ వర్మ (33), జెమీమా రోడ్రిగెస్‌ (53 నాటౌట్‌), రిచా ఘోష్‌ (31 నాటౌట్‌) చెలరేగడంతో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.  

మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌
93 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. సంధూ బౌలింగ్‌లో మారూఫ్‌కు క్యాచ్‌ ఇచ్చి హర్మన్‌ కౌర్‌ (16) ఔటైంది. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 95/3. 

రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌
65 పరుగుల వద్ద టీమిండియా రెం‍డో వికెట్‌ కోల్పోయింది. సంధూ బౌలింగ్‌లో అమీన్‌కు క్యాచ్‌ ఇచ్చి షెఫాలీ వర్మ (33) ఔటైంది. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 67/2. 

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
150 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్‌.. 38 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. సాదియా ఇక్బాల్‌ బౌలింగ్‌లో ఫాతిమా సనాకు క్యాచ్‌ ఇచ్చి యస్తికా భాటియా (17) ఔటైంది. 6 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 43/1. 

విజృంభించిన అయేషా నసీం.. సత్తా చాటిన బిస్మా మారూఫ్‌ 
కెప్టెన్‌ బిస్మా మారూఫ్‌ (55 బంతుల్లో 68 నాటౌట్‌; 7 ఫోర్లు), మిడిలార్డర్‌ బ్యాటర్‌ అయేషా నసీం (23 బంతుల్లో 43 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్‌ 2, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

తిప్పేసిన రాధా యాదవ్‌.. నాలుగో వికెట్‌ కోల్పోయిన పాక్‌
లెఫ్ట్‌ ఆర్మ స్పిన్నర్‌ రాధా యాదవ్‌ మాయాజాలం ధాటికి పాకిస్తాన్‌ 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 12.1వ ఓవర్‌లో రాధా బౌలింగ్‌లో రిచా ఘోష్‌కు క్యాచ్‌ ఇచ్చి అమీన్‌ (11) ఔటైంది. 15 ఓవర్ల తర్వాత పాక్‌ స్కోర్‌ 91/4గా ఉంది. 

ఫైర్‌ మీదున్న టీమిండియా బౌలర్లు, 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పాక్‌
టీమిండియా బౌలర్లు ఫైర్‌ మీదున్నారు. దీప్తి శర్మ, రాధా యాదవ్‌, పూజా వస్త్రాకర్‌ తలో వికెట్‌ తీయడంతో పాక్‌ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. వస్త్రాకర్‌ బౌలింగ్‌లో రిచాకు క్యాచ్‌ ఇచ్చి నిదా దార్‌ (0) డకౌటైంది. 8 ఓవర్ల తర్వాత పాక్‌ స్కోర్‌ 46/3.  

రెండో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌.. రిచా ఘోష్‌ సూపర్‌ స్టంపింగ్‌
42 పరుగుల వద్ద పాక్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. రాధా యాదవ్‌ బౌలింగ్‌లో రిచా ఘోష్‌ సూపర్‌ స్టంపింగ్‌ చేయడంతో మునీబా అలీ (12) పెవిలియన్‌ బాట పట్టింది. 7 ఓవర్ల తర్వాత పాక్‌ స్కోర్‌ 42/2గా ఉంది. 

తొలి వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌  10 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. దీప్తి శర్మ బౌలింగ్‌లో హర్మన్‌కు క్యాచ్‌ ఇచ్చి జవేరియా ఖాన్‌ (8) ఔటైంది. 4.4 ఓవర్ల తర్వాత పాకిస్తాన్‌ స్కోర్‌ 31/1గా ఉంది. బిస్మా మారూఫ్‌ (18), మునీబా అలీ (5) క్రీజ్‌లో ఉన్నారు.  

ICC Womens T20 WC 2023 IND VS PAK: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇవాళ (ఫిబ్రవరి 12) భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడుతున్నాయి. మెగా టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడుతున్న ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. టీమిండియా వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌ ఆడటం లేదు.

ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సందర్భంగా స్మృతి చేతి వేలికి గాయమైంది. స్మృతి స్థానంలో హర్లీన్‌ డియోల్‌ తుది జట్టులోకి వచ్చిందని, ఈ మ్యాచ్‌కు శిఖా పాండే దూరంగా ఉందని భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ టాస్‌ అనంతరం వెల్లడించారు. పాక్‌ జట్టులో సైతం ఓ కీలక ప్లేయర్‌ మ్యాచ్‌కు దూరమైంది. డయానా బేగ్‌ ఇవాల్టి మ్యాచ్‌ ఆడటం లేదని పాక్‌ కెప్టెన్‌ బిస్మా మారూఫ్‌ తెలిపింది.

తుది జట్లు: 

భారత్‌: షెఫాలీ వర్మ, యస్తిక భాటియా, జెమీమా రోడ్రిగెస్‌, హర్లీన్‌ డియోల్‌, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), రిచా ఘోష్‌ (వికెట్‌కీపర్‌), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్‌, రాధా యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, రేణుకా ఠాకూర్‌ సింగ్‌

పాకిస్తాన్‌: జవేరియా ఖాన్‌, మునీబా అలీ (వికెట్‌కీపర్‌), బిస్మా మారూఫ్‌ (కెప్టెన్‌), నిదా దార్‌, సిద్రా అమీన్‌,  అలీయా రియాజ్‌, అయేషా నసీమ్‌, ఫాతిమా సనా, ఎయిమన్‌ అన్వర్‌, సష్రా సంధూ, సాదియా ఇక్బాల్‌ 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top