
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 20) శ్రీలంక, బంగ్లాదేశ్ (Sri Lanka Vs Bangladesh) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు 48.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది.
హాసిని పెరీరా (85) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆమెకు కెప్టెన్ చమారీ ఆటపట్టు (46), నిలాక్షి డిసిల్వ (37) సహకరించారు. పై ముగ్గురు మినహా లంక ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు.
బంగ్లా బౌలర్లలో షోర్నా అక్తర్ (10-4-27-3) అద్భుతంగా బౌలింగ్ చేసింది. రబేయా ఖాన్ 2, నహిదా అక్తర్, నిషిత అక్తర్, మరుఫా అక్తర్ తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచాక తాము తీసుకున్న నిర్ణయం సరైంది కాదని శ్రీలంకకు తొలి బంతికే తెలిసింది. ఓపెనర్ విష్మి గౌతమ్ను మరుఫా అక్తర్ ఇన్నింగ్స్ తొలి బంతికే ఔట్ చేసింది. అనంతరం కెప్టెన్ చమారీ ఆటపట్టు (46), హాసిని పెరీరా (85) లంక ఇన్నింగ్స్ను నిర్మించారు. వీరిద్దరు రెండో వికెట్కు 72 పరుగులు జోడించారు.
ఆతర్వాత ఆటపట్టును రబేయా ఖాన్ ఔట్ చేసింది. 28 పరుగుల వ్యవధిలో శ్రీలంక మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హాసిని, నీలాక్షి లంకను ఆదుకున్నారు.
వీరిద్దరు ఐదో వికెట్కు 74 పరుగులు జోడించారు. ఆతర్వాత లంక ఇన్నింగ్స్ ఒక్కసారిగా పతనమైంది. 28 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి ఐదు వికెట్లు కోల్పోయింది.
కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సెమీస్కు చేరడం దాదాపుగా అసాధ్యం. ప్రస్తుతం ఈ జట్లు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు మూడు సెమీస్ బెర్త్‌లు ఇప్పటికే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి.
చదవండి: PAK Vs SA: మరోసారి తుస్సుమన్న బాబర్.. 73 ఇన్నింగ్స్‌లు అయ్యాయి, ఎలా భరిస్తున్నార్రా సామీ..!