ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ కొత్తగా ప్రవేశించాయి. తమ తొలి సీజన్‌లోనూ గుజరాత్ టైటాన్స్ చాంపియన్‌గా నిలిచి ఔరా అనిపిస్తే.. లక్నో ప్లేఆఫ్స్‌కు చేరి ఆకట్టుకుంది. 2023 సీజన్‌లోనూ లక్నో జట్టు మరోసారి ప్లేఆఫ్స్‌కు చేరినప్పటికీ తుదిపోరుకు అర్హత సాధించడంలో విఫలమైంది.
2024 సీజన్‌లో లీగ్ దశకే పరిమితమైన లక్నో 2025లో కెప్టెన్‌ను మార్చినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో గత సీజన్‌లోనూ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు లీగ్ దశలోనే వెనుదిరిగింది. అయితే ఈ సీజన్‌లో మాత్రం గత అనుభవాలను తిరగరాస్తూ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటాలని పంత్ సేన పట్టుదలతో ఉంది.
అదొక్కటే ఊరట!
మిగతా జట్లతో పోలిస్తే ప్లేయర్ల గాయాల బాధ లేకపోవడం ఒకింత ఊరటనిచ్చే అంశమని చెప్పొచ్చు. షమీ, నోర్ట్జే, మోసిన్ ఖాన్, ఆవేశ్‌ఖాన్, మయాంక్ యాదవ్ లాంటి పేసర్లు ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించగలరు. మరో వారం రోజుల్లో ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో లక్నో బలాలు, బలహీనతలపై ఒక లుక్కేద్దాం.
లక్నో జట్టులో హార్డ్‌హిట్టర్లకు కొదువలేదు. పొట్టి ఫార్మాట్‌లో తమ దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫలితాన్ని ఒంటిచేత్తో మార్చే శక్తి ఉన్న ప్లేయర్లు లక్నో సొంతం. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌పై తమదైన ఆటతీరుతో ముద్రవేసిన మార్కరమ్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ లక్నోకు కొండంత బలం. వీరిలో ఏ ఒక్కరు నిలదొక్కుకున్న మ్యాచ్ ఫలితం మారినట్లే.
విదేశీ ప్లేయర్లే బలం..
ఇటీవలి టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన మార్కరమ్.. మిచెల్ మార్ష్‌తో కలిసి ఇన్నింగ్స్ మొదలుపెట్టే అవకాశముంది. మరోవైపు గత రెండు సీజన్లలో 499, 524 పరుగులతో జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన నికోలస్ పూరన్ లక్నోకు అదనపు ఆకర్షణ. అవసరమైతే కీపర్‌గా సేవలందించేందుకు సిద్ధంగా ఉండే పూరన్..మిడిలార్డర్‌తో పాటు ఆఖర్లో మెరుపులు మెరిపించడంలో దిట్ట. ఇక కెప్టెన్ పంత్ ఫామ్ కొంత ఆందోళన కల్గిస్తున్నది.
గత సీజన్‌లో ఘోరంగా విఫలమైన పంత్ ఈసారైనా మెరుపులు మెరిపిస్తాడని ఫ్రాంచైజీ భారీ ఆశలు పెట్టుకుంది. ఈసారి ఇంగ్లిస్, నోర్ట్జే, హసరంగ వంటి ప్లేయర్లను వేలంలో తీసుకున్న లక్నో..వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ, అర్జున్ టెండూల్కర్‌లను ట్రేడ్ ద్వారా ఎంపిక చేసుకుంది. అయితే 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన షమీ దేశవాళీ సీజన్‌లో దుమ్మురేపాడు.
షమీ కథేంటి?
తన సూపర్ స్వింగ్‌తో అటు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీతో పాటు రంజీల్లోనూ అదరగొట్టాడు 2027 వన్డే ప్రపంచకప్ కోసం ఇస్పటి నుంచే ప్లేయర్ల ఎంపికపై దృష్టి పెట్టిన బీసీసీఐ..షమీని పరిగణనలోకి తీసుకుంటుందా అన్నది చూడాలి. జట్టులో కొంత మందికి గాయాల బెడద తోడు ఫిట్‌నెస్ సమస్యలు జట్టుకు ప్రతికూలంగా మారనున్నాయి. మిస్టరీ స్పిన్నర్ హసరంగకు శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్‌వోసీ మంజూరు కాలేదు.
మరోవైపు దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ నోకియా తరుచూ గాయాల పాలు అవుతుండటం జట్టుకు ఆందోళన కల్గిస్తున్నది. బౌలింగ్ పరంగా పేపర్ మీద బలంగా కనిపిస్తున్న లక్నోకు ఫిట్‌నెస్ పెద్ద సమస్యగా మారింది. షమీ, ఆవేశ్‌ఖాన్, మయాంక్ యాదవ్ పూర్తి సీజన్ జట్టుకు అందుబాటులో ఉంటారా అన్నది అనుమానమే. ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.


