చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సరైన ఆటగాళ్లను ఎంచుకోవడంలో సీఎస్‌కే విఫలమైందని విమర్శించాడు. గతేడాది నుంచి సీఎస్‌కే వైఫల్యాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్-2025 సీజన్‌లో పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచి పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది చెన్నై. తమ చరిత్రలో ఇంతటి ఘోర పరాభవం పొందడం ఇదే తొలిసారి. ఇక తాజాగా ఐపీఎల్-2026లో ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలైంది.
ఒక్కొక్కరికి రూ. 14 కోట్లా?
ఇదిలా ఉంటే.. మినీ వేలంలో భాగంగా ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలకు ఒక్కొక్కరికి రూ. 14 కోట్లకు పైగా చొప్పున సీఎస్‌కే ఖర్చు చేసింది. వీరి ప్రదర్శన మాత్రం ధరకు తగ్గట్లుగా లేదు. వీరిద్దరు ఇప్పటికే అరంగేట్రం చేసినా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇక సీఎస్‌కే తమ తదుపరి మ్యాచ్‌లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
ఈ నేపథ్యంలో సుబ్రమణ్యం బద్రీనాథ్ మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ కోసం ఆటగాళ్లను వెదికేందుకు హేమంగ్ బదానీ, వేణుగోపాల్ రావు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లీగ్‌లలో ప్రతి మ్యాచ్ చూస్తూ ఆటగాళ్లను వెలికి తీస్తారు.
సీఎస్‌కే కోసం ఈ పని చేసేందుకు ఎవరున్నారు? ఎవరో ఇచ్చిన సలహాలను పాటించి ఒక్కొక్కరికి రూ. 14 కోట్ల చొప్పున ఇద్దరు ఆటగాళ్ల కోసం డబ్బంతా ధారపోశారు. ప్రతిభావంతులైన ఆటగాళ్ల కోసం సీఎస్‌కే అసలు ప్రయత్నిస్తోందా?’’ అని చెన్నై మేనేజ్‌మెంట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
బుమ్రా, హార్దిక్‌లను గుర్తించింది అతడే
ఈ సందర్భంగా టీమిండియా స్టార్, దిగ్గజ పేస్ బౌలర్‌గా ఎదిగిన జస్‌ప్రీత్ బుమ్రా గురించి సుబ్రమణ్యం బద్రీనాథ్ ప్రస్తావించాడు. ‘‘అన్ని జట్లకు మంచి స్కౌట్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్‌కు మహేళ జయవర్దనే, రిక్కీ పాంటింగ్ కోచ్‌లుగా ఉన్నా.. జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాల ప్రతిభను గుర్తించింది మాత్రం జాన్ రైట్.
ఇలాంటి విషయాల్లో సీఎస్‌కు చాలా వెనుకబడి ఉంది. స్కౌటింగ్ విషయంలో వాళ్లకు అసలు సరైన విధానమే లేదు’’ అని సుబ్రమణ్యం బద్రీనాథ్ విమర్శించాడు.
చదవండి: చారిత్రక ద్వైపాక్షిక సిరీస్‌ను ప్రకటించిన పాకిస్తాన్


