
Photo Courtesy: BCCI
రాజస్తాన్ రాయల్స్ నాయకత్వ బృందంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ (Shane Watson) మండిపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సూపర్ ఓవర్‌లో రాయల్స్ తెలివి తక్కువగా వ్యవహరించి.. మ్యాచ్‌ను చేజార్చుకుందని పేర్కొన్నాడు. సూపర్ ఓవర్‌లో ఇన్‌ఫామ్ బ్యాటర్ నితీశ్ రాణాను పంపకపోవడాన్ని మతిలేని చర్యగా అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేశాడు.
ఒకే స్కోరు.. 188 పరుగులు
ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్- రాజస్తాన్ రాయల్స్ (DC vs RR) బుధవారం తలపడ్డాయి. అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ (37 బంతుల్లో 49), కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 38) రాణించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34 నాటౌట్), కెప్టెన్ అక్షర్ పటేల్ (14 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఇక లక్ష్య ఛేదనలో రాయల్స్ 20 ఓవర్ల ఆటలో నాలుగు వికెట్లు నష్టపోయి సరిగ్గా 188 పరుగులే చేసింది.
ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 51), కెప్టెన్ సంజూ శాంసన్ (19 బంతుల్లో 31 రిటైర్ట్ హర్ట్) రాణించగా.. నితీశ్ రాణా (28 బంతుల్లో 51) మెరుపు అర్ధ శతకం సాధించాడు. ఆఖర్లో ధ్రువ్ జురెల్ (17 బంతుల్లో 26), షిమ్రన్ హెట్‌మెయిర్ (9 బంతుల్లో 15 నాటౌట్) రాణించారు.
సూపర్ ఓవర్‌లో ఢిల్లీ గెలుపు
ఇక ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది. ఈ క్రమంలో తొలుత రాజస్తాన్ బ్యాటింగ్ చేయగా.. ఢిల్లీ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బంతితో రంగంలోకి దిగాడు. రాయల్స్ బ్యాటర్లలో హెట్‌మెయిర్ తొలికి పరుగులేమీ తీయలేదు. రెంబో బంతికి ఫోర్ బాది, మూడో బంతికి ఒక్క రన్ సాధించాడు.
ఇక నాలుగో బంతికి రియాన్ ఫోర్ బాదాడు.. అది నోబాల్‌గా తేలడంతో ఫ్రీ హిట్ అవకాశం రాగా.. రియాన్ రనౌట్ అయ్యాడు. ఈ క్రమంలో ఐదో బంతిని ఎదుర్కొనే క్రమంలో హెట్‌మెయిర్ కూడా రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 0.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి రాయల్స్ 11 పరుగులు మాత్రమే చేసింది.
అనంతరం సందీప్ శర్మ బౌలింగ్‌లో ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 2, 4, 1 పరుగులు రాబట్టగా.. నాలుగో బంతిని ట్రిస్టన్ స్టబ్స్ సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఈ ఉత్కంఠ పోరులో రాజస్తాన్‌పై ఢిల్లీ జయభేరి మోగించి.. సీజన్‌లో ఐదో గెలుపు నమోదు చేసి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?
ఈ నేపథ్యంలో సూపర్ ఓవర్‌లో రాజస్తాన్ రాయల్స్ నితీశ్ రాణాను బ్యాటింగ్‌కు ఎందుకు పంపలేదని షేన్ వాట్సన్ ప్రశ్నించాడు. ‘‘రాయల్స్ ఇన్నింగ్స్‌లో తొందరపాటు చర్యలు కనిపించాయి. ఇద్దరు బ్యాటర్లు రనౌట్ అయ్యారు. అసలు నితీశ్ రాణా ఏం తప్పు చేశాడు? అతడిని ఎందుకు సూపర్ ఓవర్లో బ్యాటింగ్‌కు పంపలేదు?
అతడు మంచి రిథమ్‌లో బ్యాటింగ్ చేశాడు. పరుగులు రాబట్టాడు. అయినా సరే.. అతడిని సూపర్ ఓవర్లో బ్యాటింగ్‌కు పంపలేదంటే.. మీకు బుర్ర పనిచేయడం లేదని అనుకోవాలా?’’ అంటూ షేన్ వాట్సన్ రాయల్స్ యాజమాన్యాన్ని విమర్శించాడు.
చదవండి: SRH vs MI: రైజర్స్ రఫ్ఫాడించేనా!
𝙉𝙚𝙧𝙫𝙚𝙨. 𝘿𝙧𝙖𝙢𝙖. 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨! 😉
A quick morning catch-up on that late-night Super-Over nail-biter! 🙌#TATAIPL | #DCvRR | @DelhiCapitals pic.twitter.com/QeKsfPmCyk— IndianPremierLeague (@IPL) April 17, 2025