అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే: కమిన్స్‌ | Pat Cummins After SRH Crash Out Of IPL 2026, We Lost A Couple Too Many Wickets At The Wrong Time | Sakshi
Sakshi News home page

Pat Cummins: అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే

May 28 2026 7:41 AM | Updated on May 28 2026 10:56 AM

We lost a couple too many wickets at the wrong time: Pat Cummins

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ క‌థ ముగిసింది. బుధ‌వారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఎస్‌ఆర్‌హెచ్‌.. టోర్నీ నుం‍చి ఇంటిముఖం పట్టింది. తొలుత బౌలింగ్‌లో విఫలమైన ఆరెంజ్ ఆర్మీ.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక హైదరాబాద్ జట్టు చతికలపడింది.

19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి(38), సైల్‌ ఆరోరా(35), ఇషాన్‌ కిషన్‌(33) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మరోసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

పవర్‌ప్లేలోనే మూడు కీలక వికెట్లు పడగొట్టి సన్‌రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. అంతకుముందు రాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 97 పరుగులు చేసి తృటిలో రికార్డు సెంచరీ సాధిం‍చే అవకాశాన్ని కోల్పో‍యాడు.

ఇక ఈ  హార్ట్‌బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారీ లక్ష్య ఛేదనలో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకోవడం వల్లే తమకు ఓటమి ఎదురైందని కమ్మిన్స్ తెలిపాడు. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీపై కూడా ఈ ఆసీస్ కెప్టెన్ ప్రశంసల వర్షం కురిపించాడు.

మా ఓటమికి కారణమదే..
వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ సమయంలో మా బౌలర్లకు పెద్దగా ఆప్షన్స్ లేకుండా చేశాడు. అతడిని ఆపేందుకు ఏమి చేయాలో కూడా నాకు ఆర్ధం కాలేదు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. కానీ మ్యాచ్ ఫలితంలో వారికి మాకు మార్జిన్లు చాలా తక్కువగా ఉన్నాయి. 

ఏదేమైనా వైభవ్ ఆటకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. యార్కర్ కొంచెం మిస్ అయినా వైభవ్ వాటిని వదలకుండా సిక్సర్లగా మలిచాడు. ఇక టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడంపై నాకేమీ పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే వికెట్ చివరి వరకు కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. ఈ సీజన్ ద్వారా మేము యువ ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీశాము.

మేము టోర్నీని ఓటమితో ముగించినప్పటికి ఒక పరిపూర్ణమైన జట్టుగా మాత్రం నిలిచాం. ప్రఫుల్, సాకిబ్ ల రూపంలో ఇద్దరు నాణ్యమైన ఇండియన్ పేసర్లు వెలుగులోకి వచ్చారు. టోర్నీ అంతటా వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఐపీఎల్ చరిత్రలో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న యంగెస్ట్ టీమ్స్‌లో ఒకటిగా సన్‌రైజర్స్ నిలిచింది. 

మా జట్టులో చాలా వరకు యువ ఆటగాళ్లు ఉన్నారు. యువ ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీయడంలో మా కోచింగ్ స్టాప్‌ది కీలక పాత్ర. వారి వల్లే ఆరెంజ్ ఆర్మీ ఒక పటిష్టమైన టీమ్‌గా మారింది. కాబట్టి ఒక కెప్టెన్‌గా వారు అలా రాణించడం చాలా సంతోషంగా ఉంది. 240 పరుగుల పైగా లక్ష్యాన్ని చేధించడం అంత సులువు కాదు. 

అయితే ఈ లక్ష్యాన్ని చేధించేందుకు అనువైన పిచ్ ఏదైనా ఉందంటే? అది ముల్లాన్ పూర్ మాత్ర‌మే అని క‌చ్చితంగా చెబుతాను. ఎందుకంటే ఈ పిచ్ బ్యాటింగ్‌కు అద్భుతంగా ఉంటుంది. ఛేజింగ్ చాలా వ‌ర‌కు మేము గ‌ట్టి పోటీ ఇచ్చాము. స‌రైన ర‌న్‌రేట్ మెయింటేన్ చేస్తూ ముందుకు వెళ్లాము. 

కానీ దుర‌దృష్టవశాత్తూ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం మా గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. గత మూడు సీజన్లలో మేము రెండు సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరాం. ఈసారి టాప్-2లో నిలిచేందుకు చాలా దగ్గరగా వచ్చాం. ఇంతకంటే ఎక్కువ ఆశించలేం. ఈ సీజన్ అంతటా మా బాయ్స్ అద్భుతంగా రాణించారు. వారి ప్రదర్శన పట్ల నేను ఎంతో గర్వపడుతున్నాను కమిన్స్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు.
చదవండి: వైభ‌వ్ బాధ్య‌త వారిదే.. ఐపీఎల్ చైర్మెన్ కీల‌క వ్యాఖ్య‌లు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement