
జస్ప్రీత్ బుమ్రా.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో టీమిండియా పేస్ దళానికి నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. బుమ్రా బౌలింగ్ చేస్తుంటే ప్రత్యర్ది బ్యాటర్ వెన్నులో వణుకు పుట్టాల్సిందే.
ఇంగ్లండ్ పర్యటనలో కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడినప్పటికి తన అత్యత్తుమ ప్రదర్శనను బుమ్రా ఇచ్చాడు. ఇటీవలే తన ఫిట్‌నెస్ టెస్టులను క్లియర్ చేసిన ఈ టీమిండియా పేస్ గుర్రం.. ఆసియాకప్-2025కు సిద్దమవుతున్నాడు.
ఈ నేపథ్యంలో బుమ్రాపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్, స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత తరంలో బుమ్రాను మించిన బౌలర్ మరొకరు లేరని అక్రమ్ కొనయాడాడు. అదేవిధంగా బుమ్రాను తన పోల్చడంపై ఈ పాక్ దిగ్గజం స్పందించాడు.
కాగా ఇప్పటికే చాలా సందర్బాల్లో మాజీలు బుమ్రాను అక్రమ్‌తో పోల్చారు. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో కామెంటేటర్‌గా వ్యవహరించిన భారత మాజీ పేసర్ వరుణ్ అరుణ్ అయితే ఏకంగా వసీం అక్రమ్ కంటే బెటర్ బౌలర్ అని పేర్కొన్నాడు. అయితే వసీం అక్రమ్ కూడా 90లలో తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించేవాడు.
"జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోని గొప్ప బౌలర్లలో ఒకడు. అతడికి అద్భుతమైన బౌలింగ్ యాక్షన్ ఉంది. మంచి వేగంతో కూడా బౌలింగ్ చేయగలడు. అయితే 90లలో ఆడిన బౌలర్లను ఇప్పుడు ఉన్న బౌలర్లతో పోల్చడం సరికాదు. అతను కుడిచేతి వాటం బౌలర్, నేను ఎడమచేతి వాటం బౌలర్‌ని. అతడితో నన్ను ఎలా పోలుస్తారు. బుమ్రా బౌలింగ్ యాక్షన్ వేరు, నా బౌలింగ్ యాక్షన్ వేరు.
సోషల్ మీడియాలో ఇటువంటి చర్చలు నేను తరుచుగా చూస్తున్నాను. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా ఉంది. ఈ మాజీ క్రికెటర్ల చర్చలను నేను పట్టించుకోను. బుమ్రా కూడా పట్టించుకోడు. ఈ తరంలో బుమ్రా గొప్ప బౌలర్. మా జనరేషన్‌లో మా స్దాయికి తగ్గట్టు మేము రాణించాము. కాబట్టి రెండు తరాలను పోల్చాల్సిన అవసరం లేదని జియో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ్ పేర్కొన్నాడు.
చదవండి: ‘ది హండ్రెడ్’లో ఇరగదీశారు.. ఆ నలుగరికి ఐపీఎల్‌లో భారీ ధర!