
అంతా ఊహించిందే జరిగింది. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియా-ఎ సిరీస్‌లో భాగం కావడం లేదు. ఇప్పటికే టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన రోకో ద్వయం ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు.
చివరగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జెర్సీలో కన్పించిన వీరిద్దరూ తిరిగి వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌లో ఆడనున్నారు. ఈ క్రమంలో వీరిద్దరిని స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న అనాధికారిక వన్డే సిరీస్‌లో భారత్-ఎ జట్టు తరపున ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇది వారికి ప్రాక్టీస్ ఉపయోగపడుతుందని, అందుకు రో-కో కూడా అంగీకరించారని పలు రిపోర్ట్‌లు పేర్కొన్నాయి. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ఇవన్నీ వట్టి రూమర్సే అని ఆయన కొట్టిపారేశారు.
"ఆస్ట్రేలియా-తో జరిగే సిరీస్‌లో రోహిత్, కోహ్లి ఇద్దరూ ఆడడం ఆసాధ్యమనే చెప్పాలి. ఇప్పటివరకు మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా జానియర్లతో కలిసి ఆడమని వారిని మేము బలవంతం కూడా చేయము. వారింత వారు ప్రాక్టీస్ కావాలని భావిస్తే, ఆస్ట్రేలియా వన్డేలకు ముందు ఒకటి రెండు అనాధికారిక మ్యాచ్‌లు ఆడే అవకాశముంది. కానీ ఇది జరగకపోవచ్చు.
ఎందుకంటే వారు ప్రస్తుతం చాలా ఫిట్‌గా ఉన్నారు. ఆస్ట్రేలియాతో వన్డేలకు రోహిత్, కోహ్లి కూడా సిద్దంగా ఉన్నారని" సదరు అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు. కాగా రోహిత్ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఫిట్‌గా కన్పిస్తున్నాడు. దాదాపు ఎనిమిది కేజీలు తగ్గినట్లు తెలుస్తోంది.
ఇటీవలే హిట్‌మ్యాన్ తన ఫిట్‌నెస్ టెస్టును క్లియర్ చేశాడు. కోహ్లి ఇంకా తన ఫిట్‌నెస్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంది. కాగా ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆసీస్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20 సిరీస్‌లో మెన్ ఇన్ బ్లూ తలపడనుంది.
చదవండి: ఆల్‌టైమ్ ఆసియా టీ20 జట్టు: భారత్ నుంచి ఐదుగురు.. యువీకి నో ఛాన్స్