ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌.. ఓపెనర్‌గా విరాట్‌ కోహ్లి..? | Virat Kohli Is Going To Open The Innings In Afghanistan T20 Series, Says Reports - Sakshi
Sakshi News home page

ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌.. ఓపెనర్‌గా విరాట్‌ కోహ్లి..?

Published Wed, Jan 10 2024 1:39 PM

Virat Kohli Is Going To Open The Innings In Afghanistan T20 Series Says Reports - Sakshi

ఆఫ్ఘనిస్తాన్‌తో గురువారం నుంచి ప్రారంభం కాబోయే టీ20 సిరీస్‌లో టీమిండియా ఓపెనర్‌గా విరాట్‌ కోహ్లి వస్తాడనే వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఈ ప్రచారాన్ని చూసి కోహ్లి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటే, కొందరు విశ్లేషకులు మాత్రం ఇది సాధ్యమయ్యే విషయం కాదని సదరు ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. వాస్తవానికి కోహ్లి గత ఐపీఎల్‌ సీజన్‌లో ఓపెనర్‌ అవతారమెత్తినప్పటికీ, అది క్యాష్‌ రిచ్‌ లీగ్‌ వరకే పరిమతమైంది.

గత సీజన్‌లో అతను ఓపెనర్‌గా పరుగుల వరద పారించినా, ఆతర్వాత అంతర్జాతీయ టీ20లు ఆడలేదు. దీంతో ఆ అంశం అప్పటితో మరుగున పడిపోయింది. అయితే తాజాగా కోహ్లి అంతర్జాతీయ టీ20ల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో ఓపెనర్‌ ప్రస్తావన మళ్లీ తెరపైకి వచ్చింది. పొట్టి ఫార్మాట్‌లో కోహ్లిని ఓపెనర్‌గా పంపాలని చాలామంది డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ప్రస్తుత సమీకరణల ప్రకారం​ ఇది సాధ్యపడకపోవచ్చనే చెప్పాలి.

ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ ఉన్న నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఇలాంటి సాహసాల జోలికి పోకపోవచ్చు. అలాగే ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌కు సైతం భారత సెలెక్టర్లు రోహిత్‌కు జతగా శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌లను ఓపెనర్లును ఎంపిక చేశారు. రోహిత్‌కు జతగా కోహ్లి ఇన్నింగ్స్‌ను ఓపెన్‌ చేస్తే వీరి పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే గిల్‌ టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా తన స్థానాన్ని కోల్పోయి జట్టులో చోటే ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు.

ఈ పరిస్థితుల్లో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోహ్లిని ఓపెనర్‌గా పంపించే సాహసం చేస్తుందో లేదో వేచి చూడాలి. వాస్తవానికి కోహ్లి వన్‌డౌన్‌లో వస్తే టీమిండియాకు కొండంత బలం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా చాలామంది మాజీలు ప్రస్తావిస్తూ, కోహ్లి ఇన్నింగ్స్‌ను ఓపెన్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి కోహ్లి విషయంలో జరుగుతున్న ప్రచారం నిజమో లేదో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జనవరి 11, 14, 17 తేదీల్లో జరుగనుంది. చాలాకాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి ఈ సిరీస్‌ ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆఫ్ఘన్‌తో సిరీస్‌ అనంతరం టీమిండియా స్వదేశంలోనే ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడుతుంది. 

ఓపెనర్‌గా టీ20ల్లో విరాట్‌ గణాంకాలు..

107 మ్యాచ్‌లు
107 ఇన్నింగ్స్‌లు
4011 పరుగులు
122 నాటౌట్‌ అత్యధిక స్కోర్‌
44.56 సగటు
137.64 సగటు
8 శతకాలు
28 అర్ధశతకాలు

టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్‌), సంజు శాంసన్ (వికెట్‌కీపర్‌), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్

అఫ్గనిస్తాన్‌: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్‌ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్.

 
Advertisement
 
Advertisement