45 ఏళ్ల వయసులో... | Venus Williams ready for Grand Slam re entry | Sakshi
Sakshi News home page

45 ఏళ్ల వయసులో...

Aug 15 2025 4:21 AM | Updated on Aug 15 2025 4:22 AM

Venus Williams ready for Grand Slam re entry

గ్రాండ్‌స్లామ్‌ ‘రీ ఎంట్రీ’కి వీనస్‌ విలియమ్స్‌ రెడీ

యూఎస్‌ ఓపెన్‌లో ‘వైల్డ్‌ కార్డ్‌’ ఎంట్రీ

సింగిల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పోటీపడనున్న అమెరికా దిగ్గజం  

న్యూయార్క్‌: అమెరికా టెన్నిస్‌ దిగ్గజం వీనస్‌ విలియమ్స్‌ 45 ఏళ్ల వయసులో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఓస్‌ ఓపెన్‌లో వీనస్‌ పోటీ పడనుంది. మహిళల సింగిల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో వీనస్‌కు ‘వైల్డ్‌ కార్డ్‌’ ప్రవేశం లభించింది. దీంతో రెనీ రిచర్డ్స్‌ (1981లో; 47 ఏళ్ల వయసులో) తర్వాత యూఎస్‌ ఓపెన్‌ బరిలోకి దిగనున్న అత్యంత పెద్ద వయస్కురాలిగా నిలవనుంది. 

కెరీర్‌లో 7 సింగిల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన వీనస్‌... మహిళల డబుల్స్‌లో 14, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రెండు టైటిల్స్‌ ఖాతాలో వేసుకుంది. ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు సహా మొత్తం 5 పతకాలు ఖాతాలో వేసుకుంది. ఆమె కెరీర్‌లోని ప్రధానాంశాలను ఓసారి పరిశీలిస్తే...  

» 1994లో ప్రొఫెషనల్‌ కెరీర్‌ ప్రారంభించిన వీనస్‌... 14 ఏళ్ల వయసులో ఆక్లాండ్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ టోర్నీలో పాల్గొంది.   

» 1997 ఫ్రెంచ్‌ ఓపెన్‌ ద్వారా వీనస్‌ గ్రాండ్‌స్లామ్‌ అరంగేట్రం చేసింది. తొలి రౌండ్‌లో గెలిచిన వీనస్‌... రెండో రౌండ్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.  

» అదే ఏడాది యూఎస్‌ ఓపెన్‌లో నిలకడైన ప్రదర్శన కనబర్చిన వీనస్‌... ఫైనల్‌ వరకు చేరింది. తుది సమరంలో మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌) చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 

» 1998 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తొలిసారి సోదరి సెరెనా విలియమ్స్‌తో వీనస్‌ విలియమ్స్‌ తలపడింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య 31 మ్యాచ్‌లు జరగగా... అందులో 19 మ్యాచ్‌ల్లో సెరెనా విజయం సాధించింది. 12 మ్యాచ్‌ల్లో వీనస్‌ నెగ్గింది. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో సెరెనా 11–5తో వీనస్‌పై పైచేయి కనబర్చింది.       

» సెరెనాతో కలిసి వీనస్‌ 1999లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌ టైటిల్‌ గెలిచింది. అదే సంవత్సరం ఈ అక్కాచెల్లెళ్లు యూఎస్‌ ఓపెన్‌లో సైతం విజేతలుగా నిలిచారు.  

» 20 ఏళ్ల వయసులో వీనస్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ గెలిచింది. 2000 వింబుల్డన్‌ టోర్నీలో వీనస్‌ విజేతగా నిలిచింది. తద్వారా గిబ్సన్‌ (1950లో) తర్వాత వింబుల్డన్‌ టైటిల్‌ నెగ్గిన నల్లజాతి ప్లేయర్‌గా వీనస్‌ రికార్డుల్లోకెక్కింది. అంతకుముందే 1999 యూఎస్‌ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్‌ తొలి టైటిల్‌ గెలవడంతో... టెన్నిస్‌ చరిత్రలో గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచిన మొదటి సోదరీమణులుగా సెరెనా, వీనస్‌ రికార్డుల్లోకెక్కారు.   

»  వీనస్‌ సుదీర్ఘ కెరీర్‌లో ఐదుసార్లు (2000, 2001, 2005, 2007, 2008లో) వింబుల్డన్‌ సింగిల్స్‌ టైటిల్‌ గెలిచింది. 2000, 2001లో యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచింది.  

»  2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వీనస్‌ విలియమ్స్‌ ‘డబుల్‌ ధమాకా’ మోగించింది. సింగిల్స్‌లో స్వర్ణం గెలిచిన ఈ అమెరికా ప్లేయర్‌... మహిళల డబుల్స్‌లో సోదరి సెరెనాతో కలిసి పసిడి పతకం ఖాతాలో వేసుకుంది.  

» 2008 బీజింగ్‌ ఒలింపిక్స్, 2012 లండన్‌ ఒలింపిక్స్‌ మహిళల సింగిల్స్‌లో బంగారు పతకాలు నెగ్గిన వీనస్‌... 2016 రియో విశ్వక్రీడల్లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రజతం కైవసం చేసుకుంది.  

» 2002 నుంచి 2003 వరకు వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో సెరెనా, వీనస్‌ మధ్య హోరాహోరీ సమరాలు జరిగాయి. అందులో నాలుగింట సెరెనానే విజయం సాధించింది. 1884 వింబుల్డన్‌లో మౌడ్‌ వాట్సన్, లిలియన్‌ వాట్సన్‌ తర్వాత గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో తలపడ్డ అక్కాచెల్లెళ్లు సెరెనా, వీనస్‌ కావడం విశేషం.  

» 2002 ఫిబ్రవరిలో వీనస్‌ విలియమ్స్‌ తొలిసారి డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరింది. మొత్తంగా ఆమె 11 వారాల పాటు ‘టాప్‌’లో కొనసాగింది. సెరెనా 319 వారాల పాటు అగ్రస్థానంలో నిలవడం విశేషం. 

» 2011 యూఎస్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌కు ముందు వీనస్‌ తనకు స్జోగ్రెన్స్‌ సిండ్రోమ్‌ ఉన్నట్లు వెల్లడించింది. కీళ్ల నొప్పుల కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంది.  

» గాయాల నుంచి కోలుకున్న అనంతరం తిరిగి కోర్టులో అడుగుపెట్టిన వీనస్‌... 2016–17లో అదరగొట్టింది. ఆ ఏడాది ఆ్రస్టేలియా, ఓపెన్‌ వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరి అదుర్స్‌ అనిపించుకుంది. మరో రెండు గ్రాండ్‌స్లామ్‌లలో సెమీఫైనల్స్‌ ఆడింది.  

» ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయిన వీనస్‌ విలియమ్స్‌... వరుసగా 10 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో తొలి రెండు రౌండ్‌లలోనే నిష్క్రమించింది. అందులో 2023 యూఎస్‌ ఓపెన్‌ కూడా ఉంది. ఆ తర్వాత రాకెట్‌ పక్కన పెట్టిన వీనస్‌... శస్త్రచికిత్సల అనంతరం గత నెల డీసీ సిటీ ఓపెన్‌ ద్వారా తిరిగి మైదానంలో అడుగు పెట్టింది. ఇప్పుడు 
సొంతగడ్డపై జరుగుతున్న యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో లేటు వయసులోనూ తనదైన ముద్ర వేయాలని భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement