వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఫుట్‌బాల్ ప్రపంచంలో లామిన్ యమల్ ఎంతటి సంచలనమో.. ఇప్పుడు క్రికెట్ వరల్డ్‌లో వైభవ్ కూడా అంతే ఫేమస్. కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించిన వైభవ్.. ఇప్పుడు అంతర్జాతీయ స్ధాయిలో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు.
వరల్డ్‌క్లాస్ బౌలర్లను సైతం తన బ్యాటింగ్‌తో వణికిస్తున్న ఈ బిహార్ ఆటగాడు.. నేడు తన 15వ పుట్టిన రోజును జరపునకుంటున్నాడు. దీంతో వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసేందేకు అర్హత సాధించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒక ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే కనీసం 15 ఏళ్లు నిండి ఉండాలి. ఇప్పుడు సరిగ్గా ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఒక్క రోజు ముందే తన 15వ ఏటలోకి అడుగుపెట్టాడు. దీంతో సీనియర్ జట్టు తరుపున ఆడేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు.
వైభవ్ జోరు కొనసాగుతుందా?
తన అరంగేట్ర ఐపీఎల్ సీజన్‌లో దుమ్ములేపిన వైభవ్ ఇప్పుడు.. ఐపీఎల్ 2026లో ఎలా రాణిస్తాడో అని అందరూ అతృతగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్‌లో వైభవ్ తన ఆడిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. అది కూడా శార్ధూల్ ఠాకూర్ వంటి సీనియర్ బౌలర్ బౌలింగ్‌లో కావడం గమనార్హం.
ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో 35 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్.. ఐపీఎల్ చరిత్రలో శతక్కొట్టిన అతి పిన్న వయష్కుడిగా రికార్డులెక్కాడు. అనంతరం అండర్-19 ప్రపంచకప్‌లోనై ఈ యువ సంచలనం సత్తాచాటాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో భారీ సెంచరీ వైభవ్(175) చెలరేగాడు. ఇప్పుడు అదే జోరును ఈ ఏడాది ఐపీఎల్‌లో కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
డేంజర్‌లో సచిన్ రికార్డు!
భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్నవయష్కుడిగా రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కలిగి ఉన్నాడు. సచిన్ 16 ఏళ్ల 205 రోజుల్లో టీమిండియా తరపున డెబ్యూ చేశాడు. ఇప్పుడు ఈ క్రికెట్ దేవుడు రికార్డు డేంజర్‌లో పడింది. వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక చేసే అవకాశముంది. ఐపీఎల్ తర్వాత టీమిండియా రెండు టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.
అనంతరం అక్కడ నుంచి ఇంగ్లండ్ టూర్‌కు మెన్ ఇన్ బ్లూ వెళ్లనుంది. అయితే టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఐరీష్ టూర్‌కు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి భారత సీనియర్ జట్టు నుంచి పిలుపు వచ్చే ఛాన్స్ ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే జరిగితే భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించనున్నాడు. ఒకవేళ ఐర్లాండ్ టూర్‌కు ఎంపిక కాకపోయినా.. ఈ ఏడాది ఆఖరిలో జరిగే ఏషియన్ గేమ్స్‌లోనైనా అతడు భారత్ తరపున డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది.
చదవండి: Evin Lewis: విండీస్ క్రికెటర్ సంచలన నిర్ణయం!


