భారత క్రికెట్ వర్గాల్లో గత కొంతకాలంగా చర్చనీయాంశమైన పేరు వైభవ్ సూర్యవంశీ. గతేడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ చిచ్చర పిడుగు ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో)తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. కేవలం పద్నాలుగేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించి.. సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఫార్మాట్లకు అతీతంగా
ఇక భారత్ అండర్-19 క్రికెట్ జట్టు తరఫునా ఫార్మాట్లకు అతీతంగా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అదరగొట్టాడు. అదే విధంగా వరల్డ్‌కప్ ఫైనల్లో విధ్వంసకర శతకం (80 బంతుల్లో 175)తో భారత్‌కు టైటిల్ అందించాడు. ఈ క్రమంలో భారీ అంచనాలతో ఐపీఎల్-2026 బరిలో దిగిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తొలి మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై దంచికొట్టాడు.
ఆది నుంచే దూకుడు
కేవలం 15 బంతుల్లోనే అర్థ శతకం సాధించి సత్తా చాటాడు వైభవ్. ఇక గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ 18 బంతుల్లో 31 పరుగులతో అలరించాడు. ఈ క్రమంలో రాజస్తాన్ రాయల్స్ తమ మూడో మ్యాచ్‌లో భాగంగా మంగళవారం గువాహటిలో ముంబై ఇండియన్స్‌తో తలపడనుండగా.. వైభవ్ గురించి మరోసారి చర్చ మొదలైంది.
వరల్డ్‌క్లాస్ బౌలర్, టీమిండియా పేస్‌దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రాను వైభవ్ ఎలా ఎదుర్కొంటాడోనన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. ముంబై సైతం ఈ కుర్రాడి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించిందా? అన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కోచ్ పారస్ మాంబ్రే కీలక వ్యాఖ్యలు చేశాడు.
వైభవ్ గురించి తెలుసు
‘‘ముందుగా ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. వైభవ్ కొత్త ఆటగాడేమీ కాదు. ఐపీఎల్‌లో అతడికి ఇది రెండో సంవత్సరం. కాబట్టి అతడు కొత్త కాదు. అయితే, అతడొక మంచి ప్లేయర్. అయినా అతడి కోసం మేమేమీ ప్రత్యేకంగా ప్రణాళికలు రచించడం లేదు. మిగతా వారిలాగే అతడు కూడా!’’ అని పారస్ మాంబ్రే కొట్టిపారేశాడు.
అతడికి అంత సీన్ లేదు
ఇక రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ రవి బిష్ణోయి గురించి ప్రస్తావన రాగా.. ‘‘రవి మిస్టరీ స్పిన్నర్‌గానే కొనసాగుతున్నాడని నేను నమ్మను. గత కొన్నేళ్లుగా అతడు ఎలా ఆడుతున్నాడో అందరికీ తెలుసు.
ఆటగాళ్ల కెరీర్‌లో ఒడిదుడుకులు సహజం. ఒక్కోసారి బాగా ఆడతారు.. మరోసారి తేలిపోతారు. ఇప్పుడు ఫామ్‌లో ఉన్నంత మాత్రాన అతడి గురించి భయపడాల్సిందేమీ లేదు’’ అని పారస్ మాంబ్రే అతడిని తేలికగానే తీసుకుంటున్నట్లు తెలిపాడు.
కాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రవి బిష్ణోయి అదరగొట్టిన సంగతి తెలిసిందే. నాలుగు ఓవర్ల కోటాలో 41 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. సాయి సుదర్శన్ (73), గ్లెన్ ఫిలిప్స్ (3), వాషింగ్టన్ సుందర్ (4), రాహుల్ తెవాటియా (12) రూపంలో కీలక వికెట్లు తీసి రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
చదవండి: BCCI: ‘అమ్మిన మోడల్ ఇది కాదు.. ఏటా రూ. 2400 కోట్ల నష్టం’


