BCCI: ‘అమ్మిన మోడల్‌ ఇది కాదు.. ఏటా రూ. 2400 కోట్ల నష్టం’ | This Is Not What We Sold: Lalit Modi Slams BCCI Says Rs 2400 Cr IPL Loss | Sakshi
Sakshi News home page

BCCI: ‘అమ్మిన మోడల్‌ ఇది కాదు.. ఏటా రూ. 2400 కోట్ల నష్టం’

Apr 7 2026 12:20 PM | Updated on Apr 7 2026 1:24 PM

This Is Not What We Sold: Lalit Modi Slams BCCI Says Rs 2400 Cr IPL Loss

ప్రతీకాత్మకం (ఐపీఎల్‌ మాజీ చాంపియన్‌ కోల్‌కతా జట్టు)

బీసీసీఐపై లలిత్‌ మోదీ విమర్శలు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వ్యవస్థాపక చైర్మన్‌ లలిత్‌ మోదీ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) విధానాలను విమర్శించాడు. బోర్డు అనుచిత నిర్ణయం కారణంగా ఏటా రూ. 2400 కోట్ల మేర ఐపీఎల్‌కు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నాడు. కాగా 2008లో లలిత్‌ మోదీ ఆలోచనతో ఐపీఎల్‌ రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే.

రికార్డు స్థాయి అమ్మకాలు
అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఈ టీ20 లీగ్‌.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందింది. ఇటీవలి కాలంలో ఐపీఎల్‌ (IPL) ప్రసార హక్కులు ఏకంగా రూ. 48,390 కోట్లకు అమ్ముడుపోయాయంటే దీనికున్న క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అంతేకాదు ఇటీవల రాజస్తాన్‌ రాయల్స్‌, రాయల్‌ చాలెంజర్స్ బెంగళూరు జట్లను అమ్మకానికి పెట్టగా.. రికార్డు స్థాయిలో రాయల్స్‌ రూ. 15 వేల కోట్లు, బెంగళూరు జట్టు రూ. 16 వేల కోట్లకు పైగా అమ్ముడుపోయాయి. అయితే, బీసీసీఐ అనుసరిస్తున్న విధానం వల్ల ఐపీఎల్‌కు అదనంగా రావాల్సిన ఆదాయం రాకుండాపోతోందని లలిత్‌ మోదీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ఈ మోడల్‌ను మేము అమ్మలేదు
‘‘ఐపీఎల్‌లో ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐకి యాభై శాతం, జట్లకు యాభై శాతం ఆదాయాన్ని పంచుతారు. అయితే, మొదట్లో ఎనిమిది జట్లు మాత్రమే ఉండేవి. ప్రతి జట్టు సొంతమైదానంతో పాటు బయటి గ్రౌండ్‌లో ఒకే ప్రత్యర్థితో రెండు మ్యాచ్‌లు తప్పనిసరిగా ఆడేది. కానీ ఇప్పుడు లీగ్‌లో పది జట్లు ఉన్నాయి.

అయినప్పటికీ మ్యాచ్‌ల సంఖ్య 74గానే ఉంది. నిజానికి ఈ సంఖ్య 94కు చేరాల్సింది. ఇది కాంట్రాక్టు తప్పిదం. నిజానికి ఈ మోడల్‌ను మేము అమ్మలేదు. ప్రతి జట్టుకు హోం అండ్‌ అవే మ్యాచ్‌ ఆడేలా ఫార్మాట్‌ రూపొందించాము.

రూ. 2400 కోట్ల నష్టం
ఒకవేళ 94 మ్యాచ్‌లు నిర్వహించేందుకు క్యాలెండర్‌ సహకరించకపోతే.. అప్పుడు జట్ల సంఖ్య పెంచుకుండా ఉండాల్సింది. నిజానికి 94 మ్యాచ్‌ల ఫార్మాట్‌ అమలైతే ఒక్కో మ్యాచ్‌కు అదనంగా రూ. 118 కోట్లు వస్తాయి.

అంటే మీడియా హక్కుల ద్వారా అదనంగా మరో రూ. 2400 కోట్లు వస్తాయి. ఇందులో బీసీసీఐకి రూ. 1200 కోట్లు, జట్లకు రూ. 1200 కోట్ల వాటా దక్కుతుంది’’ అని లలిత్‌ మోదీ స్పోర్ట్స్‌స్టార్‌తో చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌ రూపకర్తగా ప్రసిద్ది చెందిన లలిత్‌ మోదీ మనీ లాండరింగ్‌ ఆరోపణలతో.. ఆర్థిక నేరగాడిగా ముద్రపడి.. దేశం విడిచిపారిపోయాడు. 

చదవండి: ‘త్వరలోనే టీమిండియా టీ20 కెప్టెన్‌ అవుతాడు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement