ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గత పద్దెమినిదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న టీ20 లీగ్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందింది. 2008లో మొదలైన ఈ టోర్నీ.. 2021 వరకు ఎనిమిది జట్లతో కొనసాగింది. ఈ క్రమంలో 2022లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా చేరడంతో జట్ల సంఖ్య పదికి చేరింది.
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌లతో పాటు లక్నో (LSG), గుజరాత్ (GT) నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, అత్యంత ఆదరణ పొందిన ఐపీఎల్‌ను మరింత విస్తృతం చేయాలనే డిమాండ్లు ఉన్నాయి.
రికార్డు స్థాయిలో రూ. 48,390 కోట్లు
ఐసీసీ ఈవెంట్లతో సమానంగా ఐపీఎల్ క్రేజ్ సంపాదించిందనడంలో అతిశయోక్తి లేదు. గతేడాది పది ఫ్రాంఛైజీలు వెయ్యి కోట్ల రూపాయల మేర ఆదాయం పొందడం.. ఐపీఎల్ ప్రసార హక్కులు రికార్డు స్థాయిలో రూ. 48,390 కోట్లకు అమ్ముడుపోవడం ఇందుకు నిదర్శనం.
74 మ్యాచ్‌లతోనే
ఈ నేపథ్యంలో క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు మరో రెండు జట్లు చేర్చి.. మ్యాచ్‌ల సంఖ్య పెంచుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2023, 2024లో 74 మ్యాచ్‌లు నిర్వహించగా.. 2025, 2026 సీజన్లలో 84 మ్యాచ్‌లు.. 2027 నాటికి వీటి సంఖ్య 94కు పెంచుతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. నేటికీ 74 మ్యాచ్‌లతోనే టోర్నీ కొనసాగుతోంది.
కుదరదు
తాజాగా మరోసారి ఈ అంశం మీద చర్చ జరుగుతుండగా.. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ (Arun Dhumal) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పట్లో ఐపీఎల్ జట్లు, మ్యాచ్‌ల సంఖ్య పెంచే అవకాశం లేదని సంకేతాలు ఇచ్చాడు. ‘‘మ్యాచ్‌ల సంఖ్యను 74 నుంచి 94కు పెంచడం కష్టం. ఎందుకంటే అంతర్జాతీయ షెడ్యూల్‌తో మ్యాచ్ చేయలేము.
మార్చి- మే వరకు దీనిని పరిమిత విండోలో మాత్రమే నిర్వహించగలము. ఒకవేళ జూన్ వరకు కొనసాగిస్తే.. దక్షిణ భారతంలోని చాలా ప్రాంతాల్లో అప్పటికే రుతుపవనాలు ప్రవేశిస్తాయి. వర్షాల ప్రభావం ఉంటుంది. కాబట్టి అప్పుడు మ్యాచ్‌ల నిర్వహణ కష్టం.
వారికి ప్రయోజనం ఉండదు
ఒకవేళ ఒకేసారి డబుల్ హెడర్ మ్యాచ్‌లు అంటే ఒకేరోజు ఒకే వేదికపై రెండు మ్యాచ్‌లు నిర్వహించాలనుకున్నా బ్రాడ్‌కాస్టర్లకు ఇది అంతగా నచ్చదు. వారికి పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి బ్రాడ్‌కాస్టర్ల పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టేకునే మేము 74 మ్యాచ్‌లకు విండోను పరిమితం చేవాము’’ అని అరుణ్ ధుమాల్ చెప్పుకొచ్చాడు.
కాగా ఇప్పటికే టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్ విరామం లేని బిజీ షెడ్యూల్‌తో కిక్కిరిసిపోయింది. ఇలాంటి తరుణంలో ఐపీఎల్ విస్తృతిని పెంచడం సాధ్యం కాదని అరుణ్ ధుమాల్ పరోక్షంగా స్పష్టం చేశాడు.
చదవండి: నాకైతే భయం వేస్తోంది: వైభవ్ సూర్యవంశీపై పాక్ మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు


