ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీ.. వైభ‌వ్‌కు ప్ర‌మోష‌న్‌! | Vaibhav Sooryavanshi-Ishan Kishan-Play Together-New IPL Team-2027 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీ.. వైభ‌వ్‌కు ప్ర‌మోష‌న్‌!

May 22 2026 3:37 PM | Updated on May 22 2026 5:56 PM

Vaibhav Sooryavanshi-Ishan Kishan-Play Together-New IPL Team-2027

ఐపీఎల్‌ 2026 సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారంతో లీగ్‌ దశ ముగిసి ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ఏడాది టైటిల్‌ ఎవరి సొంతమవుతుందనేది మే 31న తేలిపోనుంది. ఈ నేప‌థ్యంలో ఇషాన్ కిష‌న్‌, వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌చ్చే ఏడాది ఐపీఎల్‌లో ఒకే జ‌ట్టుకు ఆడ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ఒక వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. 

బీహార్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అగర్వాల్‌ బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీకి అనుమతి ఇస్తే 'బెమిసల్ బీహార్' పేరుతో కొత్త జట్టును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి బీసీసీఐ ఒప్పుకుంటే వచ్చే ఏడాది ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీని చూసే అవకాశముంది. 

ఈ ఫ్రాంచైజీ ఏర్పాటైతే ఇషాన్‌ కిషన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని, వైభవ్‌ సూర్యవంశీ వైస్‌ కెప్టెన్‌గా ఉంటాడని ఆయన పేర్కొన్నారు. ‘బెమిస‌ల్‌ బీహార్‌’తో కూడిన జెర్సీని కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ హోదాలో ఇషాన్ కిష‌న్‌, వైభ‌వ్ సూర్య‌వంశీ క‌లిసి ఆవిష్క‌రిస్తున్న ఫొటో చాట్ జీపీటీ ద్వారా ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం వైర‌ల్‌గా మారింది.  

బీహార్‌కు చెందిన ఈ ఇద్ద‌రితో పాటు ఈ సీజ‌న్‌లో వేర్వేరు జ‌ట్ల‌కు ఆడుతున్న అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ (కేకేఆర్‌), సాకిబ్ హుస్సేన్ (ఎస్ఆర్‌హెచ్‌) కూడా అదే రాష్ట్రానికి చెందిన‌వారు కావ‌డం విశేషం.  అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న ఈ న‌లుగురు బీహార్ నుంచి వ‌చ్చిన‌వారు కావ‌డంతో సెప‌రేట్‌గా ఒక‌ ఐపీఎల్ జ‌ట్టు ఉంటే బాగుంటుందని అనిల్ అగ‌ర్వాల్ తెలిపారు. 

ఈ అంశం క్రీడ‌ల ప‌రంగా బీహార్‌ను ప్ర‌పంచ స్థాయి మౌలిక స‌దుపాయాల‌ను అందించ‌డంతో పాటు త‌ర్వాతి త‌రం క్రికెట‌ర్ల‌కు ఇది స్ఫూర్తినిచ్చే అవ‌కాశ‌ముంద‌ని ఆయ‌న‌ తెలిపారు. అనిల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. 'చెన్నై సూప‌ర్‌కింగ్స్‌, ముంబై ఇండియ‌న్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌లాగే బీహార్‌కు కూడా సొంత ఫ్రాంచైజీ ఉండాల‌నుకోవ‌డంలో త‌ప్పులేదు. ఎందుకంటే బీహార్ గ‌డ్డ ఈ దేశానికి ఎంతో మంది క్రికెట‌ర్ల‌ను అందించింది. 

ప‌ట్నాలో జ‌న్మించిన ఇషాన్ కిష‌న్ వ‌న్డేల్లో అత్యంత వేగ‌వంత‌మైన డ‌బుల్ సెంచ‌రీ సాధించాడు. ఇక బీహార్‌లోని స‌మ‌స్తిపూర్‌కు చెందిన సూర్య‌వంశీ ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతిపిన్న వ‌య‌స్కుడిగా  నిలిచాడు. గోపాల్‌గంజ్‌లోని ఒక సాధార‌ణ కుటుంబం నుంచి వ‌చ్చిన సాకిబ్ హుస్సేన్ ఇవాళ త‌న బౌలింగ్‌తో యావ‌త్ క్రికెట్ ప్ర‌పంచాన్ని ఆక‌ర్షిస్తున్నాడు. 

ఇదే రాష్ట్రానికి చెందిన అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ త‌న డైన‌మైట్ ఇన్నింగ్స్‌ల‌తో అల‌రిస్తున్నాడు. వీరంద‌రిని ఒక చోట చేర్చేలా బీహార్ పేరుతో ఒక ఫ్రాంచైజీని తీసుకొస్తే బాగుంటుంది' అని చెప్పుకొచ్చారు. 

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో బ్యాటింగ్‌లో మెరిసిన వాళ్ల‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వైభ‌వ్ సూర్య‌వంశీతో పాటు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వైస్‌కెప్టెన్ ఇషాన్ కిష‌న్ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఈ సీజ‌న్‌లో వైభ‌వ్ 13 మ్యాచ్‌ల్లో 579 ప‌రుగుల‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉండ‌గా, ఇషాన్ కిష‌న్ 13 మ్యాచ్‌ల్లో 490 ప‌రుగుల‌తో రేసులో 10వ స్థానంలో కొన‌సాగుతున్నాడు. 

కాగా అనిల్ అగ‌ర్వాల్ ప్ర‌తిపాద‌న‌తో బీహార్ నూత‌న ముఖ్య‌మంత్రి స‌మ్రాట్ చౌద‌రీ ఏకీభ‌వించారు. 'బీహార్ క్రికెట్ అభివృద్ధి కోసం ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన దార్శ‌నిక‌తో ఒక మిష‌న్ మోడ్‌లా ప‌నిచేస్తోంది. మీరు ప్ర‌తిపాదించిన విష‌యంతో ఏకీభ‌విస్తూ ఒక సానుకూల నిర్ణ‌యం తీసుకుంటాం' అని చెప్పుకొచ్చారు. 

ఇక ఐపీఎల్‌లో తొలుత 8 ఫ్రాంచైజీలు ఉంటే ఆ సంఖ్య 10కి పెంచారు. ఇటీవ‌లే ఆర్సీబీ, రాజ‌స్తాన్ ఫ్రాంచైజీలు భారీ ధ‌ర‌కు చేతులు మారాయి. ఒక‌వేళ బీసీసీఐ ఐపీఎల్‌లో ఫ్రాంచైజీల సంఖ్య‌ను విస్త‌రించాల‌నుకుంటే మాత్రం బీహార్‌కు చెందిన అనిల్ అగ‌ర్వాల్ ఒక ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ముందుకు రావొచ్చు.

చదవండి: పంత్ డిమోష‌న్ వెనుక అతడిదే కీల‌క‌పాత్ర‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement