AUS Vs AFG: పూర్‌ అంపైరింగ్‌.. ఆరుకు బదులు ఐదు బంతులే

Umpire Did-not Notice 5 Ball-Over AUS Vs AFG Match T20 WC 2022 - Sakshi

ఒక ఓవర్‌లో ఎన్ని బంతులుంటాయని క్రికెట్‌పై కనీసం పరిజ్ఞానం ఉన్న వాళ్లని అడిగితే టక్కున 'ఆరు' అని చెప్పేస్తారు. అయితే ఐదు బంతులు పడగానే ఓవర్‌ ముగిసిపోవడం ఎప్పుడైనా చూశారా. ఒకవేళ చూడకుంటే మాత్రం వెంటనే ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌ రీప్లే చూడండి. టి20 ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం ఆసీస్‌, ఆఫ్గన్‌ మ్యాచ్‌ ఒక ఓవర్‌ ఐదు బంతులతోనే ముగియడం ఆసక్తికరంగా మారింది. 

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌ను నవీన్‌-ఉల్‌-హక్‌ వేశాడు. ఆ సమయంలో క్రీజులో మిచెల్‌ మార్ష్‌, డేవిడ్‌ వార్నర్‌లు క్రీజులో  ఉన్నారు. తొలి రెండు బంతులకు రెండు సింగిల్స్‌ వచ్చాయి. ఆ తర్వాత మూడో బంతిని మార్ష్‌ బౌండరీ తరలించాడు. ఇక నాలుగో బంతిని వార్నర్‌ డాట్‌బాల్‌ ఆడాడు. ఆ తర్వాత ఐదో బంతికి మూడు పరుగులు వచ్చాయి. ఓవర్‌ పూర్తయిందనుకున్న నవీన్‌ ఉల్‌ హక్‌ అంపైర్‌ వద్దకి వచ్చాడు.

అంపైర్‌ కూడా మిస్‌ కమ్యునికేషన్‌ వల్ల ఓవర్‌ పూర్తైనట్లుగా భావించాడు. మిచెల్‌ మార్ష్‌, డేవిడ్‌ వార్నర్‌ సహా ఆఫ్గన్‌ ఆటగాళ్లు కూడా ఈ తప్పిదాన్ని గుర్తించలేకపోయారు. అయితే ఓవర్‌ పూర్తై మరుసటి ఓవర్‌ తొలి బంతి పడిన తర్వాత ఫీల్డ్‌ అంపైర్‌ తప్పిదాన్ని గమనించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఒక బంతి తక్కువగా ఆడినట్లయింది. 

అయితే ఇది అంపైర్ల తప్పిదమని అభిమానులు పేర్కొంటున్నా చిన్న మిస్‌ కమ్యునికేషన్‌ గ్యాప్‌ వల్ల ఇలా జరిగిందనుకోవచ్చు. ఫీల్డ్‌లో ఉండే అంపైర్లు చూసుకోవాల్సిన పనుల్లో ఇది కూడా ఒకటి. ఓవర్‌ పూర్తయ్యేవరకు అన్ని బంతులను కౌంట్‌ చేయడంతో పాటు పరుగులు, రనౌట్లు, లెగ్‌బైలు, నోబ్‌లతో పాటు చాలా అంశాలను పరిగణించాల్సి ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు అంపైర్లు కూడా పొరపాటు చేయడం సహజం. అయితే ఇది తొలి ఇన్నింగ్స్‌లో జరిగింది కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు కానీ రెండో ఇన్నింగ్స్‌లో అయ్యుంటే వివాదంగా మారేది.

చదవండి: డిఫెండింగ్‌ చాంపియన్‌కు కష్టమే.. ఇంగ్లండ్‌ ఓడితేనే

27 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా విఫలం.. ఎట్టకేలకు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top