
యూఏఈ ట్రై సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (సెప్టెంబర్ 2) జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాడు హరీస్ రౌఫ్ పలు రికార్డుల్లో భాగమయ్యాడు. ఈ మ్యాచ్‌లో పాక్ ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో ఓడినా రౌఫ్ పలు ఘనతలు సాధించాడు. స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ అయిన రౌఫ్.. బౌలింగ్‌లో కాకుండా బ్యాటింగ్‌లో రికార్డుల్లో భాగం కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో 10వ స్థానంలో (లక్ష్య ఛేదనలో) బ్యాటింగ్‌కు వచ్చిన రౌఫ్.. 16 బంతుల్లో 4 సిక్సర్ల సాయంతో 34 పరుగులతో అజేయంగా నిలిచాడు. రౌఫ్ మెరుపు ఇన్నింగ్స్ పాక్‌ను గెలిపించలేకపోయినా అతన్ని మాత్రం రికార్డుపుటల్లోకెక్కించింది.
అంతర్జాతీయ టీ20ల చరిత్రలో 10 లేదా 11వ స్థానంలో వచ్చి అత్యధిక సిక్సర్లుగా (4) బాదిన ఆటగాడిగా రౌఫ్ విండీస్ ఆటగాడు అకీల్ హొసేన్‌తో కలిసి ప్రపంచ రికార్డును షేర్ చేసుకున్నాడు.
అలాగే చివరి వికెట్‌కు సూఫియాన్ ముఖీమ్‌తో కలిసి (7 నాటౌట్) రౌఫ్ నెలకొల్పిన అజేయమైన 40 పరుగుల భాగస్వామ్యం పాక్ తరఫున 10వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యంగా రికార్డైంది. గతంలో ఈ రికార్డు షోయబ్ అక్తర్-వాహబ్ రియాజ్ (31*) పేరిట ఉండేది.
ఈ మ్యాచ్‌లో రౌఫ్ చేసిన స్కోర్ (34 నాటౌట్) పాక్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్‌గా నిలిచింది. పాక్ టీ20ల చరిత్రలో 10 లేదా 11వ నంబర్ ఆటగాళ్ళు ఓ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలవడం ఇదే మొదటిసారి.
మ్యాచ్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటి పాక్‌కు ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ పాక్‌ను 18 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సెదీఖుల్లా అటల్ (64), ఇబ్రహీం జద్రాన్ (65) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో ఫహీమ్ అష్రాఫ్ (4-0-27-4) అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
అనంతరం ఆఫ్ఘన్ బౌలర్లు చెలరేగడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫజల్ హక్ ఫారూకీ, కెప్టెన్ రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, నూర్ అహ్మద్ తలో 2 వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టారు.