
ద్వైపాక్షిక సిరీస్‌లు కాకుండా పాక్ ఇటీవలికాలంలో ఆడిన ఏ ప్రధాన టోర్నీ గెలవలేదు. చివరిగా 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆ జట్టు.. ఎట్టకేలకు 8 ఏళ్ల తర్వాత రెండుకు పైగా జట్లు పాల్గొన్న ఓ టోర్నీలో విజయం సాధించింది. యూఏఈ వేదికగా జరిగిన ముక్కోణపు టోర్నీలో విజేతగా నిలిచింది. నిన్న (సెప్టెంబర్ 7) జరిగిన ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.
షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ చెప్పుకోదగ్గ స్కోరేమీ చేయలేదు. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫకర్ జమాన్ (27), మొహమ్మద్ నవాజ్ (25), కెప్టెన్ సల్మాన్ అఘా (24) మాత్రమే 20కి పైగా స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్‌ను కట్టడి చేశారు. రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూకీ తలో 2, ఘజన్‌ఫర్ ఓ వికెట్ తీసి పాక్‌ను కట్టడి చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో పాక్ విజయవంతమైంది. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ తడబడింది. మొహమ్మద్ నవాజ్ (4-1-19-5) ధాటికి 15.5 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా లో స్కోరింగ్ మ్యాచ్‌లో 75 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, సుఫియాన్ ముఖీమ్ కూడా తలో 2 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్‌ను దెబ్బ కొట్టారు. షాహీన్ అఫ్రిది ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (17), సెదిఖుల్లా అటల్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ టోర్నీలో పాల్గొన్న మరో జట్టు యూఏఈ. ఈ జట్టు లీగ్ దశలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓడి అప్పుడే నిష్క్రమించింది.