
ది హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2025 తుది దశకు చేరుకుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం లండన్ వేదికగా ట్రెంట్ రాకెట్స్, నార్తర్న్ సూపర్‌చార్జర్స్ మధ్య జరగాల్సిన ఎలిమినిటేర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో నిలిచిన ట్రెంట్ రాకర్స్ ఫైనల్లో అడుగు పెట్టింది.
పాయింట్ల పట్టికలో రాకర్స్(24) రెండో స్దానంలో నిలవగా.. సూపర్‌చార్జర్స్(20) మూడో స్ధానంతో సరిపెట్టుకుంది. కాగా వర్షం కారణంగా రద్దు అయిన ఈ మ్యాచ్‌లో తొలుత నార్తర్న్ సూపర్‌చార్జర్స్ బ్యాటింగ్ చేసింది. సూపర్ చార్జర్స్ బ్యాటింగ్ సందర్భంగా వరుణుడు పదేపదే అంతరాయం కలిగించాడు.
సూపర్ చార్జర్స్ స్కోర్ 75 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 119 పరుగుల వద్ద భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత సుమారు గంట సేపు వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. దీంతో సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్ ముగియగా.. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ట్రెంట్ రాకర్స్ లక్ష్యాన్ని 75 బంతుల్లో 134గా నిర్ణయించారు.
అయితే ట్రెంట్ రాకెట్స్ లక్ష్య చేధనకు దిగి కేవలం ఐదు బంతులు మాత్రమే ఆడగా మళ్లీ వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ను అంపైర్‌లు రద్దు చేశారు. దీంతో కావ్యామారన్ టీమ్‌కు నిరాశే ఎదురైంది. కాగా నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిస్టర్ ఫ్రాంచైజీ కావడమే గమనార్హం.
ఇక ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న ఫైనల్లో ఓవల్ ఇన్విన్సిబుల్స్, ట్రెంట్ రాకెట్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. మరోవైపు మహిళల ఫైనల్లో సదరన్ బ్రేవ్ ఉమెన్, నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్లు తలపడనున్నాయి.
చదవండి: The Hundred: టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ..! ఎవరీ డేవినా పెర్రిన్?