అసలు సమరానికి సై! | Today match between India and Australia | Sakshi
Sakshi News home page

అసలు సమరానికి సై!

Oct 8 2023 4:01 AM | Updated on Oct 8 2023 4:03 AM

Today match between India and Australia - Sakshi

ప్రపంచకప్‌ గెలిచే వరకు మన పని పూర్తి కాదని గొప్పవాళ్లు తరచుగా చెబుతుంటారు. అది వాస్తవం కూడా. అందుకే మేమూ దానిని గెలవాలని కోరుకుంటున్నాం. అయితే దానికో పద్ధతి ఉంది. దానిని పాటించాలి. ఎలాగైనా గెలవాలని మొండిగా వెళితే తప్పులు జరగవచ్చు.

వరల్డ్‌ కప్‌ గెలవాలనే కోరిక, ఆశ  ఉండటంతో తప్పు లేదు. కానీ అన్నీ కలిసి రావాలి. 99 శాతం మన శ్రమ తర్వాత ఆ ఒక్క శాతం అదృష్టం దేవుడి చేతుల్లో ఉంటుంది. భారత క్రికెటర్లపై ఒత్తిడి ఎప్పుడైనా ఉండేదే. అది సహజం. అయితే దానిని అధిగమించగల అనుభవం జట్టులో చాలా మందికి వచ్చేసింది. –రోహిత్‌ శర్మ, భారత కెప్టెన్‌  

చెన్నై: వన్డే క్రికెట్‌లో మరోసారి జగజ్జేతగా నిలిచే లక్ష్యంతో భారత జట్టు తొలి అడుగు వేసేందుకు సిద్ధమైంది. అభిమానుల భారీ అంచనాలను మోస్తూ ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా నేడు మొదటి మ్యాచ్‌లో మరో మాజీ చాంపియన్‌ ఆ్రస్టేలియాను ఎదుర్కొంటుంది. టోర్నీ ప్రారంభమైన తర్వాత తొలి నాలుగు రోజుల్లో అంతంతమాత్రమంగా ఉన్న అభిమాన ప్రదర్శన ఈ మ్యాచ్‌తో ఆకాశాన్ని తాకనుంది. ఇటీవలే ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌ తర్వాత ప్రత్యర్థి గురించి ఇరు జట్లకూ తగిన అవగాహన ఉండటంతో ఆసక్తికర పోరు ఖాయం. రెండు పెద్ద జట్ల మధ్య జరిగే ఈ సమరం సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.  

బరిలో ఇషాన్‌ కిషన్‌... 
వరల్డ్‌ కప్‌ గెలిచిన కెప్టెన్‌గా ప్రపంచ క్రికెట్‌లో తనకు ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించాలని కోరుకుంటున్న రోహిత్‌ శర్మకు ఇది కీలక మ్యాచ్‌. పటిష్ట జట్టును తొలి పోరులో ఓడిస్తే టోర్నీ తర్వాతి మ్యాచుల్లో ఆ ఆత్మవిశ్వాసం కొనసాగడం ఖాయం. అయితే రోహిత్‌కు జోడీగా ఓపెనింగ్‌ చేసే గిల్‌ ‘డెంగీ’ కారణంగా మ్యాచ్‌కు దూరం కావడం కాస్త నిరాశపర్చే అంశం. కానీ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌ కోసం సిద్ధంగా ఉండటం సానుకూలాంశం.

రోహిత్, కోహ్లి, శ్రేయస్, కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ ఫామ్‌ విషయంలో ఎలాంటి ఆందోళన లేదు. వీరంతా కలిసి జట్టుకు భారీ స్కోరు అందించగల సమర్థులు. బౌలింగ్‌లో ముగ్గురు స్పిన్నర్లను తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని రోహిత్‌ ఇప్పటికే చెప్పాడు. కుల్దీప్‌తో పాటు సొంతగడ్డపై అశ్విన్‌ బరిలోకి దిగడం ఖాయం. మూడో స్పిన్నర్‌గా జడేజా తనవంతు పాత్ర పోషిస్తాడు. ఇద్దరు పేసర్లు బుమ్రా, సిరాజ్‌లు ఆరంభంలో ప్రభావం చూపిస్తే జట్టుకు తిరుగుండదు.  

ఆత్మవిశ్వాసంతో ఆసీస్‌... 
ప్రపంచకప్‌కు ముందు భారత్‌తో రెండు మ్యాచ్‌లు ఓడి వన్డే సిరీస్‌ కోల్పోయినా... చివరి మ్యాచ్‌లో గెలుపు జట్టుకు ఉత్సాహాన్ని అందించింది. ముఖ్యంగా స్పిన్‌ విభాగంలో మ్యాక్స్‌వెల్‌ ప్రదర్శన జట్టు బలం పెంచింది. రెగ్యులర్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా కూడా రాణించాల్సి ఉంది. అటు అనుభవం, ఇటు రికార్డులపరంగా కూడా ఆసీస్‌ పేస్‌ దళం చాలా పటిష్టంగా ఉంది. స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్‌ ఏ పిచ్‌పైనైనా ప్రభావం చూపగలరు. స్టొయినిస్, గ్రీన్‌ రూపంలో జట్టులో మంచి ఆల్‌రౌండర్లు ఉన్నారు.

స్టొయినిస్‌ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. ఆ్రస్టేలియా బ్యాటింగ్‌ బృందం కూడా చాలా పటిష్టంగా ఉంది. భారత గడ్డపై అపార అనుభవం ఉన్న వార్నర్‌కు దూకుడైన మిచెల్‌ మార్ష్ జత కలిస్తే శుభారంభాలు ఖాయం. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను నడిపించేందుకు స్మిత్, లబుషేన్‌ ఉన్నారు. లోయర్‌ ఆర్డర్‌లో క్యారీ, మ్యాక్స్‌వెల్‌ దూకుడుగా ఆడగల సమర్థులు. భారత్‌లాగే ఆసీస్‌ కూడా వరల్డ్‌ కప్‌ ఫేవరెట్‌లలో ఒకటి. ఆ జట్టు స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిస్తే భారత్‌కు గెలుపు అంత సులువు కాదు.    

12  ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్, ఆ్రస్టేలియా జట్లు ఇప్పటి వరకు 12 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్‌ 4 మ్యాచ్‌ల్లో... ఆస్ట్రేలియా 8 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. చెన్నైలో ఈ రెండు జట్లు మూడుసార్లు పోటీపడ్డాయి. భారత్‌ ఒక మ్యాచ్‌లో, ఆసీస్‌ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. 

పిచ్, వాతావరణం 
సాధారణ బ్యాటింగ్‌ పిచ్‌. అయితే మరీ భారీ స్కోర్లకు అవకాశం లేదు. మ్యాచ్‌కు వాడబోయే పిచ్‌ నల్లరేగడి మట్టిది కావడంతో కాస్త నెమ్మదిగా ఉంటుంది. స్పిన్‌కు అనుకూలిస్తుంది కూడా. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్‌ ఆసాంతం కాకపోయినా కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగించవచ్చు. శనివారం సాయంత్రం చెన్నైలో భారీ వర్షం కురిసింది.  

తుది జట్ల వివరాలు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, హార్దిక్, జడేజా, అశ్విన్, బుమ్రా, సిరాజ్, కుల్దీప్‌. 
ఆస్ట్రేలియా: కమిన్స్‌ (కెప్టెన్‌), వార్నర్, మార్ష్, స్మిత్, లబుషేన్, గ్రీన్, క్యారీ, మ్యాక్స్‌వెల్, స్టార్క్, హాజల్‌వుడ్, జంపా.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement