బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌ ఘన విజయం

Team India Won Boxing Day Test Against Australia By 8 Wickets - Sakshi

మెల్‌బోర్న్‌: పింక్‌ బాల్‌ టెస్టులో ఘోర పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో 8 వికెట్ల తేడాతో ఒక రోజు ఆట మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. ఆసీస్‌ నిర్దేశించిన 70 పరుగుల స్వల్ప టార్గెట్‌ను టీమిండియా 15.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ హీరో కెప్టెన్‌ అజింక్యా రహానే (40 బంతుల్లో 27; 3 ఫోర్లు), ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ (36 బంతుల్లో 35; 7 ఫోర్లు)‌ లక్ష్యం చిన్నదే కావడంతో ఆచితూచి ఆడి టార్గెట్‌ను కరిగించారు. మూడో వికెట్‌కు విలువైన 51 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఫలితంగా వెంటవెంటనే మయాంక్‌ అగర్వాల్‌ (5), పుజారా (3) వికెట్‌ కోల్పోయినప్పటికీ భారత్‌ సునాయాసంగా గెలుపు బాట పట్టింది.

ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌, కమిన్స్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. విరాట్‌ కోహ్లి, మహ్మద్‌ షమీ దూరమైనప్పటికీ రహానే నేతృత్వంలో విజయం సాధించిన భారత్‌ నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1 తో సమం చేసింది. కెప్టెన్‌ ఇన్సింగ్స్‌తో ఆకట్టుకున్న అజింక్యా రహానే ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. కెప్టెన్‌గా టెస్టుల్లో రహానేకు ఇది మూడో విజయం కావడం విశేషం. అంతేకాకుండా మెల్‌బోర్న్‌లో భారత జట్టుకు వరుసగా రెండో విజయం కూడా ఇదే. మొత్తంగా మెల్‌బోర్న్‌లో భారత జట్టుకు నాలుగో విజయమిది. ఇక జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరగనుంది.
(చదవండి: ఈ దశాబ్దపు మేటి క్రికెటర్‌ కోహ్లి)

ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 195 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 200 ఆలౌట్‌

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 326 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 70/2(15.5 ఓవర్లు)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top