IND VS SA: కింగ్‌ కోహ్లిని కలిసిన పాక్‌ పేసర్లు.. హోరెత్తుతున్న సోషల్‌మీడియా

T20 WC 2022: Virat Kohli Met Pakistani Bowlers Before Match Against South Africa - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా రేపు (అక్టోబర్‌ 30 టీమిండియా-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం రోహిత్‌ సేన మ్యాచ్‌ వేదిక అయిన పెర్త్‌కు ఇవాళ ఉదయమే చేరుకుంది. ఇదే వేదికపై రేపే పాకిస్తాన్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ కూడా జరుగనుంది. పాక్‌ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభంకానుండగా.. టీమిండియా మ్యాచ్‌ సాయంత్రం 4:30 గంటలకు మొదలవుతుంది.

గ్రూప్‌-2కు సంబంధించి పెర్త్‌ వేదికగా రేపు జరుగబోయే మ్యాచ్‌లు నాలుగు జట్లకు (భారత్‌, సౌతాఫ్రికా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌) కీలకం కావడంతో ఆయా జట్లన్నీ ప్రాక్టీస్‌లో తలమునకలై ఉన్నాయి. భారత్‌, పాక్‌ మ్యాచ్‌లు ఒకే వేదికపై ఒకదాని తర్వాత మరొకటి జరుగనుండటంతో స్టేడియం క్యాంటీన్‌ వద్ద ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు ఎదురెదురుపడ్డారు.

ఈ సందర్భంగా పాక్‌ స్టార్‌ పేసర్లు హరీస్‌ రౌఫ్‌, షాహిన్‌ అఫ్రిదిలు.. టీమిండియా ఆటగాడు కింగ్‌ కోహ్లిని కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ ముగ్గురు ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ సమయంలో తీసిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్లతో సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు.

ఈ ఫోటోను బేస్‌ చేసుకుని భారత అభిమానులు పాక్‌ను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. భయ్యా.. నీ వల్ల మా జిందగీ బర్బాద్‌ (నాశనం) అయ్యిందంటూ పాక్‌ పేస్‌ ద్వయం కోహ్లితో గోడు వెల్లబుచ్చుకుంటున్నట్లుందని కామెంట్లు చేస్తున్నారు. తదుపరి మ్యాచ్‌ల్లో ఎలా గెలవాలో చిట్కాలైన చెప్పు భయ్యా అంటూ పాకీలు ప్రాధేయపడుతున్నారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మీ ఖేల్‌ ఖతమైంది.. ఇక దుఖానం సర్దేయండి అంటూ కోహ్లి పాక్‌ బౌలర్లు చెబుతున్నాడని ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. వారి మధ్య ఏం సంభాషణ జరిగిందో కానీ, భారత అభిమానులు మాత్రం రకరకాలుగా ఊహించుకుని పాక్‌ను ఆటాడేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే, అక్టోబర్‌ 23న జరిగిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో విరాట్‌ ఈ ఇద్దరు పాక్‌ బౌలర్లను ఉతికి ఆరేసిన విషయం తెలిసిందే. హరీస్‌ రౌఫ్‌ వేసిన 19వ ఓవర్‌లో కోహ్లి వరుసగా రెండు అద్భుతమైన సిక్సర్లు బాది మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పాడు. అప్పటి దాకా టీమిండియాను గడగడలాడించిన రౌఫ్‌.. కోహ్లి మహోగ్రరూపం చూసి నిశ్రేష్ఠుడయ్యాడు. అదే మ్యాచ్‌లో అఫ్రిదిని సైతం కోహ్లి ఓ ఆటాడుకున్నాడు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆఖరి బంతి వరకు సాగిన ఆ మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top