భారత టి20 జట్టు కెప్టెన్ గా సూర్యకుమార్‌ 

Suryakumar as captain of Indian T20 team - Sakshi

ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌

23న వైజాగ్‌లో తొలి మ్యాచ్‌

ముంబై: ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును సోమవారం ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ తొలిసారి నాయకత్వం వహిస్తాడు. ఈ సిరీస్‌ కోసం భారత జట్టు హెడ్‌ కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌ వ్యవహరిస్తాడు. వన్డే వరల్డ్‌కప్‌లో ఆడిన భారత జట్టు నుంచి సూర్యకుమార్, ఇషాన్‌ కిషన్, ప్రసిధ్‌ కృష్ణ, శ్రేయస్‌ అయ్యర్‌ మినహా మిగతా సభ్యులందరికీ ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి ఇచ్చారు.

ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఈనెల 23న విశాఖపట్నంలో జరుగుతుంది. అనంతరం 26న తిరువనంతపురంలో రెండో మ్యాచ్‌... 28న గువాహటిలో మూడో మ్యాచ్‌... డిసెంబర్‌ 1న రాయ్‌పూర్‌లో నాలుగో మ్యాచ్‌... డిసెంబర్‌ 3న బెంగళూరులో చివరిదైన ఐదో మ్యాచ్‌ జరుగుతాయి. తొలి మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్న శ్రేయస్‌ అయ్యర్‌... చివరి రెండు మ్యాచ్‌లకు జట్టులోకి వైస్‌ కెప్టెన్ హోదాలో వస్తాడు.

తొలి మూడు మ్యాచ్‌లకు రుతురాజ్‌ గైక్వాడ్‌ వైస్‌ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ముంబైకి చెందిన 33 ఏళ్ల సూర్యకుమార్‌ ఇప్పటి వరకు 53 టి20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 3 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 1,841 పరుగులు చేశాడు. భారత టి20 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్న 13వ ప్లేయర్‌గా సూర్యకుమార్‌ గుర్తింపు పొందనున్నాడు.  

భారత టి20 జట్టు:
సూర్యకుమార్‌ యాదవ్‌(కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (వైస్‌ కెప్టెన్ ), ఇషాన్‌ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్‌ వర్మ, రింకూ సింగ్, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్, అక్షర్‌ పటేల్, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్, అర్‌‡్షదీప్‌ సింగ్, ప్రసిధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్, ముకేశ్‌ కుమార్‌.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top