
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) గురించి ఇటీవలి కాలంలో విమర్శలు ఎక్కువయ్యాయి. అతడు తనకు ఇష్టమైన వాళ్లనే జట్టులోకి తీసుకుంటాడనే ఆరోపణలు మరోసారి తెరమీదకు వచ్చాయి. భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) ధోనిని ఉద్దేశించి ‘ఫేవటెరిజం’ కామెంట్లు చేయడం ఇందుకు కారణం.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తండ్రి యోగ్‌రాజ్ సింగ్ కూడా మరోసారి ధోనిపై విమర్శలు ఎక్కుపెట్టాడు. ధోని వల్లే తన కుమారుడి కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోయిందని.. గౌతం గంభీర్, వీరేందర్ సెహ్వాగ్, హర్భజన్ సింగ్ తదితరులు కూడా అతడి బాధితులేనని ఆరోపించాడు.
అది పక్షపాతం కాదు..
ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం ధోనికి మద్దతుగా నిలిచాడు. విజయవంతమైన కెప్టెన్లపై ఇలాంటి విమర్శలు సహజమేనని పేర్కొన్నాడు. ‘‘కెప్టెన్ ఎల్లప్పుడూ అత్యుత్తమ జట్టునే ఎంపిక చేసుకోవాలని భావిస్తాడు.
ఆ సమయంలో ఫామ్‌లో ఉండి.. ఒత్తిడిలోనూ రాణించగల ఆటగాళ్లకు వైపు మొగ్గుచూపుతాడు. కెప్టెన్ అయినా.. కోచ్ అయినా ఇదే పనిచేస్తారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. దీనిని పక్షపాతం, ఫేవటెరిజం అని అనకూడదు. వాళ్ల ప్రదర్శన ఆధారంగానే సదరు ప్లేయర్లు కెప్టెన్‌తో ఎక్కువకాలం కొనసాగారు అని అర్థం.
సక్సెస్‌ఫుల్ కెప్టెన్.. ఎప్పుడూ ఇలాగే ఆలోచిస్తాడు
జట్టులో మొత్తం ఎంత మంది ప్లేయర్లు ఉన్నారు. వారిలో ఎంతమంది బెంచ్ మీద ఉన్నారన్న విషయం మీద మాత్రమే కెప్టెన్, కోచ్ దృష్టిసారించరు. ఒక విజయవంతమైన కెప్టెన్‌పై ఇలాంటివి అస్సలు ప్రభావం చూపించవు. తన జట్టులో సమర్థవంతమైన ఆటగాళ్లు ఉన్నారా? లేరా? ఇది గెలిచే జట్టేనా? అని మాత్రమే సారథి ఆలోచిస్తాడు.
నిజానికి అందరికంటే కెప్టెన్‌పై ఒత్తిడి, బాధ్యతా ఎక్కువగా ఉంటాయి. అతడిపై అంచనాలు కూడా అదేస్థాయిలో ఉంటాయి. అంతేగానీ.. కెప్టెన్‌కు నచ్చకపోవడం వల్ల.. అతడితో ఎక్కువ సమయం గడపకపోవడం వల్ల జట్టు నుంచి తప్పించడం వంటివి జరగవు’’ అని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు. అలా సుతిమెత్తగానే ఇర్ఫాన్ పఠాన్‌కు చురకలు అంటించాడు.
ఇప్పుడు ఇద్దరం కలిసే..
కాగా గతంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. హుక్కా తాగుతూ, అతడికి కూడా అందిస్తూ ఉండేవాళ్లనే ప్రోత్సహిస్తాడంటూ ధోనిపై పరోక్షంగా విమర్శలు చేశాడు. ఇటీవల ఆ వ్యాఖ్యలు మరోసారి తెరమీదకు రాగా.. ఇప్పుడు ఇద్దరం కలిసే హుక్కా తాగుతున్నామని ఇర్ఫాన్ ఓ నెటిజన్ ప్రశ్నకు బదులిచ్చాడు.
అయితే, ఇర్ఫాన్ వ్యాఖ్యల నేపథ్యంలో యువీ తండ్రి మరోసారి ధోనిని టార్గెట్ చేయడం గమనార్హం. ఇక 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ధోని.. టీమిండియా తరఫున అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.
చదవండి: చిన్ననాటి గురువుకు రూ. 80 లక్షల సాయం.. హార్దిక్, కృనాల్ మంచి మనసు