
టీమిండియా ఆల్‌రౌండర్లలో యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ప్రత్యేకం. భారత్ 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలవడంలో ఈ చండీగఢ్ స్టార్‌ది కీలక పాత్ర. ముఖ్యంగా సొంతగడ్డపై యాభై ఓవర్ల ఫార్మాట్లో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.
ఇక ఈ రెండు ఐసీసీ ట్రోఫీలను మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సారథ్యంలోనే టీమిండియా గెలుచుకోవడం విశేషం. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న తర్వాత విరాట్ కోహ్లి (Virat Kohli) భారత జట్టు పగ్గాలు చేపట్టగా.. యువీ అతడి నాయకత్వంలోనూ ఆడాడు.
అయితే, క్యాన్సర్ బారిన పడిన తర్వాత యువీ కెరీర్ నెమ్మదించింది. ఈ క్రమంలో 2017లో టీమిండియా తరఫును ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ తన చివరి మ్యాచ్ ఆడేశాడు. ఆ తర్వాత రెండేళ్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
అక్కడంతా వెన్నుపోటుదారులే
ఈ పరిణామాల నేపథ్యలో యువీ తండ్రి, కోచ్ యోగ్‌రాజ్ సింగ్.. ధోని, కోహ్లిలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘డబ్బు, పేరు ప్రఖ్యాతులు, విజయం ఉన్న చోట.. స్నేహితులు ఉండరు. అక్కడంతా వెన్నుపోటుదారులే ఉంటారు.
అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతూ ఉంటే వెనక్కి లాగాలని ప్రయత్నిస్తారు. చాలా మందికి యువరాజ్ సింగ్ అంటే భయం. అతడు తనకున్న ప్రతిభతో తమ స్థానాల్ని ఎక్కడ ఆక్రమిస్తాడేమోననే అభద్రతా భావం.
ధోని, కోహ్లిలకు యువీ అంటే భయం
యువీ.. దేవుడు సృష్టించిన గొప్ప ఆటగాడు. గ్రేటెస్ట్ ఆఫ్ గ్రేట్ ప్లేయర్స్. ఎంఎస్ ధోని నుంచి.. ఆ తర్వాత కెప్టెన్ అయిన వారి దాకా అంతా యువీ అంటే భయపడేవాళ్లే. తమ కుర్చీని అతడు లాక్కుంటాడేమోనని భయపడ్డారు.
నా కుమారుడికి సచిన్ టెండుల్కర్ తప్ప క్రికెట్ ప్రపంచంలో మంచి స్నేహితులు ఎవరూ లేరు’’ అని యోగ్‌రాజ్ సింగ్ ఇన్‌సైడ్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. భయం వల్లే ధోని, కోహ్లిలు తన కుమారుడి కెరీర్ నాశనం చేశారంటూ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. కాగా ధోనిపై యోగ్‌రాజ్ ఆరోపణలు ఇదే మొదటిసారి కాదు. అయితే, ఈసారి కోహ్లిని కూడా ఇందులోకి లాగాడు.
మేటి ఆల్‌రౌండర్
కాగా ఎడమచేతి వాటం బ్యాటర్.. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన యువీ.. 2000- 2017 తదాకా అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాడు. టీమిండియా తరపున 40 టెస్టుల్లో 1900, 304 వన్డేల్లో 8701, 58 టీ20 మ్యాచ్‌లలో కలిపి 1177 పరుగులు సాధించాడు. అదే విధంగా.. టెస్టుల్లో తొమ్మిది, వన్డేల్లో 111, టీ20లలో 28 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన బవుమా బృందం.. బ్రీట్జ్కే వరల్డ్ రికార్డుతో..