
జోహన్నెస్‌బర్గ్ వేదికగా నిన్న (సెప్టెంబర్ 9) జరిగిన SA20 లీగ్ 2025-26 వేలంలో సౌతాఫ్రికా వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ టెంబా బవుమాకు ఘోర అవమానం జరిగింది. జాతీయ జట్టుకు రెండు ఫార్మాట్లలో కెప్టెన్ అయినా బవుమాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.
వరుసగా రెండో సీజన్‌లో ఫ్రాంచైజీలు బవుమాను చిన్నచూపు చూశాయి. ఈసారి వేలంలో బవుమా 2 లక్షల ర్యాండ్‌ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. అతనిపై ఒక్క ఫ్రాంచైజీ కూడా ఆసక్తి కనబర్చలేదు.
ఫ్రాంచైజీలు చిన్నచూపు చూడటానికి బవుమా టీ20 రికార్డు మరీ అంత తీసికట్టుగా ఏమీ లేదు. ఈ ఫార్మాట్‌లో అతను 123.99 స్ట్రయిక్‌రేట్‌తో 27.07 సగటున 2653 పరుగులు చేశాడు. అంతర్జాతీయంగానూ బవుమా టీ20 రికార్డు బాగానే ఉంది. సౌతాఫ్రికా తరఫున అతను 36 టీ20ల్లో 118.17 స్ట్రయిక్‌రేట్‌తో 670 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ద సెంచరీ ఉంది.
2021-2022 మధ్యలో బవుమా సౌతాఫ్రికా టీ20 కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అతని సారథ్యంలో సౌతాఫ్రికా రెండు టీ20 వరల్డ్‌కప్‌లు (2021,2022) ఆడింది. అయినా బవుమాను సొంత దేశంలో జరిగే టోర్నీలోనే ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరం. బవుమా ఆటగాడిగా, కెప్టెన్‌గా తన జట్టుకు వంద శాతం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు. కొన్ని సార్లు సఫలం కాకపోవచు. ఇది ఆటలో సర్వసాధాణం.
బవుమాకు పొట్టి క్రికెట్ ఆడే టాలెంట్ లేక విస్మరణకు గురైతే పెద్దగా పట్టింపు లేదు. అతనిలో పొట్టి క్రికెట్‌కు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నా ఎవరు పట్టించుకోకపోవడమే బాధాకరం.
అత్యుత్తమ కెప్టెన్
ఎవరు ఔనన్నా కాదన్నా సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో బవుమా అత్యుత్తమ కెప్టెన్. ఈ ఏడాది అతను సౌతాఫ్రికాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా నిలబెట్డాడు. తాజాగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ను వారి దేశాల్లోనే వన్డే సిరీస్‌ల్లో మట్టికరిపించాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్న బవుమాకు సొంత దేశంలో జరిగే టోర్నీలోనే ఆదరణ లభించకపోవడం విచారకరం.
ఇదిలా ఉంటే, నిన్న జరిగిన వేలంలో బవుమాతో పాటు జేమ్స్ ఆండర్సన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుసాల్ పెరీరా, మొయిన్ అలీ లాంటి స్టార్ ఆటగాళ్లకు కూడా చుక్కెదురైంది. వీరిని కూడా ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు.
డెవాల్డ్ బ్రెవిస్, ఎయిడెన్ మార్క్రమ్, మాథ్యూ బ్రీట్జ్కీ లాంటి ఆటగాళ్లు మాత్రం జాక్‌పాట్ కొట్టారు. బ్రెవిస్‌ను ప్రిటోరియా క్యాపిటల్స్ రూ. 8.31 కోట్లకు.. మార్క్రమ్‌ను డర్బన్ సూపర్ జెయింట్స్ రూ. 7.05 కోట్లకు.. బ్రీట్ట్కేను సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ రూ. 3.05 కోట్లకు కొనుగోలు చేశాయి.