వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ బెర్త్‌పైసఫారీ జట్టు గురి
నేడు ఇంగ్లండ్ జట్టుతో సెమీఫైనల్
మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
గువాహటి: అన్ని విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ... మహిళల వన్డే ప్రపంచకప్‌లో జోరు మీదున్న దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్ బెర్త్‌పై గురి పెట్టింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్ చేరుకోలేకపోయింది. మూడుసార్లు సెమీఫైనల్లోకి ప్రవేశించినా ఆ అడ్డంకిని దాటడంలో విఫలమైంది. నాలుగో ప్రయత్నంలోనైనా సెమీఫైనల్ అవరోధాన్ని అధిగమించి ఫైనల్లోకి దూసుకెళ్లాలని దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే తొలి సెమీఫైనల్లో పటిష్టమైన ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది.
దక్షిణాఫ్రికాతో పోలిస్తే ఇంగ్లండ్‌కు ప్రపంచకప్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటికే ఎనిమిదిసార్లు ఫైనల్ చేరుకున్న ఇంగ్లండ్... నాలుగుసార్లు విజేతగా నిలిచి, మరో నాలుగుసార్లు రన్నరప్ ట్రోఫీని అందుకుంది. ఇక తాజా ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్‌దే పైచేయిగా ఉంది. తమతో ఆడిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 69 పరుగులకు కుప్పకూల్చిన ఇంగ్లండ్ మరోసారి అలాంటి ప్రదర్శన పునరావృతం చేయాలనే లక్ష్యంతో ఉంది.
మరోవైపు ఇంగ్లండ్ చేతిలో ఎదురైన తొలి మ్యాచ్ పరాజయానికి బదులు తీర్చుకోవాలని దక్షిణఫ్రికా భావిస్తోంది. ఆస్ట్రేలియాతో లీగ్ దశ చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 97 పరుగులకే ఆలౌటైంది. ఈ రెండు సందర్భాల్లోనూ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సఫారీ బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లోపాలను వినియోగించుకోవాలని ఇంగ్లండ్ ప్రణాళికలు రచిస్తోంది. సోఫీ ఎకిల్‌స్టోన్, లిన్సే స్మిత్, చార్లీ డీన్ రూపంలో ఇంగ్లండ్‌కు ముగ్గురు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు.
దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్‌వార్ట్... ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 50.16 సగటుతో 301 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపిస్తోంది. బ్రిట్స్, సునే లుస్, మరిజాన్ కాప్ రూపంలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. బౌలింగ్‌లో కాప్, ఖాకా, ఎంలాబా కీలకం కానున్నారు. మరోవైపు ఇంగ్లండ్ మాజీ సారథి కెప్టెన్ హీథర్ నైట్ ఈ వరల్డ్‌కప్‌లో 288 పరుగులు చేసి ఆ జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచింది. అమీ జోన్స్, బ్యూమౌంట్ కూడా రెండొందల పైచిలుకు పరుగులు చేశారు. కెప్టెన్ సివర్ బ్రంట్ రూపంలో నిఖార్సైన ఆల్‌రౌండర్ అందుబాటులో ఉంది.
రిజర్వ్ డే...
మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటికీ ఈ టోర్నీలోని రెండు సెమీఫైనల్స్‌కు, ఫైనల్ మ్యాచ్‌కు ‘రిజర్వ్ డే’ ఉంది. బుధవారం వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోతే... గురువారం నిర్వహిస్తారు. ఒకవేళ గురువారం కూడా మ్యాచ్ జరగపోతే మాత్రం లీగ్ దశలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు ఫైనల్ (ఇంగ్లండ్) చేరుకుంటుంది.
36 దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 47 వన్డేలు జరిగాయి. 36 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలుపొందగా ... 10 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా నెగ్గింది. ఒక మ్యాచ్ రద్దయింది. ఇక వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు తొమ్మిదిసార్లు తలపడ్డాయి. 7 సార్లు ఇంగ్లండ్, 2 సార్లు దక్షిణాఫ్రికా విజయం సాధించాయి.


