కలిసిపోయిన స్మృతి- పలాష్‌ కుటుంబాలు?.. త్వరలోనే పెళ్లి?! | Smriti Mandhana Palash Muchhal Patch up Rumours: Viral video Shows This | Sakshi
Sakshi News home page

కలిసిపోయిన స్మృతి- పలాష్‌ కుటుంబాలు?.. త్వరలోనే పెళ్లి?!

Apr 8 2026 5:03 PM | Updated on Apr 8 2026 5:28 PM

Smriti Mandhana Palash Muchhal Patch up Rumours: Viral video Shows This

పలాష్‌ కుటుంబంతో స్మృతి (పాత ఫొటో)

భారత మహిళా క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది స్మృతి మంధాన. టీమిండియా ఓపెనర్‌గా, వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఎన్నో ఘనతలు సాధించిన ఈ ముంబైకర్‌ ఖాతాలో గతేడాది ప్రపంచకప్‌ కూడా చేరింది. సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్‌-2025లో భారత్‌ గెలవడంతో స్మృతి చిరకాల కోరిక నెరవేరింది.

ఘనంగా హల్దీ, మెహందీ
ఆ ఆనందంలోనే మెగా టోర్నీ ముగిసిన కొన్నిరోజులకే పెళ్లి పీటలు ఎక్కేందుకు స్మృతి సిద్ధమైంది. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న పలాష్‌ ముచ్చల్‌తో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టేందుకు ఆమె కుటుంబం ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి హల్దీ, మెహందీ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి.

చిరకాల స్నేహితులు, భారత క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్‌, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పటేల్‌, రాధా యాదవ్‌ తదితరులు స్మృతి ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో సందడి చేశారు. అంతా సజావుగా సాగిపోతుందనుకున్న సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

వివాహం రద్దైనట్లు ప్రకటనలు
పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్‌ అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కాగా.. పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. అయితే, ఆ వెంటనే పలాష్‌ తనతో అసభ్యకరంగా చాటింగ్‌ చేశాడని.. అందులో స్మృతిని కించపరిచేలా మాట్లాడినట్లు ఉన్న స్క్రీన్‌షాట్లను ఓ అమ్మాయి షేర్‌ చేయడం కలకలం రేపింది.

ఈ పరిణామాల ‍క్రమంలో స్మృతి మంధాన- పలాష్‌ ముచ్చల్‌ తమ వివాహం రద్దైనట్లు విడివిడిగా అధికారిక ప్రకటనలు విడుదల చేశారు. అయితే, తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో ద్వారా స్మృతి- పలాష్‌ల వివాహానికి మార్గం సుగమమైందనే ఊహాగానాలకు ఊతమిచ్చింది.

కలిసిపోయిన కుటుంబాలు?
పలాష్‌ సోదరి, బాలీవుడ్‌ సింగర్‌ పాలక్‌ ముచ్చల్‌ ముంబైలోని ఓ రెస్టారెంట్‌ బయటకు రాగా.. అక్కడే స్మృతి తండ్రి శ్రీనివాస్‌ కూడా ఉన్నారు. వెంటనే పాలక్‌.. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. ఆ తర్వాత తన భర్త మిథున్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ వీడియో వైరల్‌ కావడంతో స్మృతి- పలాష్‌ల పెళ్లి జరుగబోతుందనే వదంతులు పుట్టుకొచ్చాయి.

అయితే, చాలా మంది నెటిజన్లు మాత్రం ఇది పాత వీడియో అయి ఉంటుందని కొట్టిపారేస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత స్మృతి అతడిని క్షమించే ప్రసక్తే లేదని పేర్కొంటున్నారు. అయితే, స్మృతి అభిమానులు మాత్రం ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సంతోషంగా ఉంటే చాలని కామెంట్లు చేస్తున్నారు.

కాగా పలాష్‌ నిజస్వరూపం తెలిసిన తర్వాత స్మృతి స్నేహితురాళ్లు అతడికి చితక్కొట్టారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, పలాష్‌ మాత్రం తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. మరోవైపు.. పెళ్లి రద్దైన తర్వాత స్మృతి ఆటపై దృష్టి పెట్టి.. వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2026లో రాయల్‌ చాలెంజర్స్‌​ బెంగళూరు జట్టును విజేతగా నిలిపింది. తద్వారా ఆర్సీబీకి రెండు టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా ఘనత సాధించింది.

చదవండి: పాపం.. గర్ల్‌ఫ్రెండ్‌ చేసిన పనికి సిన్నర్‌ ఏమవుతాడో!

 

Advertisement
 
Advertisement
Advertisement