మరోసారి అగ్రపీఠాన్ని అధిరోహించిన టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ | Smriti Mandhana Reaches No.1 in ICC ODI Rankings Ahead of World Cup | Sakshi
Sakshi News home page

మరోసారి అగ్రపీఠాన్ని అధిరోహించిన టీమిండియా స్టార్‌ ప్లేయర్‌

Sep 16 2025 3:08 PM | Updated on Sep 16 2025 3:30 PM

Smriti Mandhana Dethrones ENG Captain To Reclaim No. 1 Batter In ICC ODI Rankings

భారత స్టార్‌ మహిళా క్రికెటర్‌ స్మృతి మంధన ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ స్థానానికి చేరింది. గత వారం ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉండిన మంధన.. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రాణించి (58 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) 7 అదనపు రేటింగ్‌ పాయింట్లను సాధించింది. తద్వారా తన పాయింట్ల సంఖ్యను 735కు పెంచుకుని టాప్‌ ర్యాంక్‌కు చేరింది. 

ఈ క్రమంలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ నాట్‌ సీవర్‌ బ్రంట్‌ను కిందకు దించి, కెరీర్‌లో నాలుగో సారి అగ్రపీఠాన్ని అధిరోహించింది. 2019లో తొలిసారి టాప్‌ ర్యాంక్‌ను కైవసం చేసుకున్న మంధన.. ఈ ఏడాది జూన్‌, జులైల్లో కూడా స్వల్ప కాలం నంబర్‌ వన్‌ వన్డే బ్యాటర్‌గా కొనసాగింది. ప్రస్తుతం మంధనకు రెండో స్థానంలో ఉన్న బ్రంట్‌కు కేవలం నాలుగు రేటింగ్‌ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. 

ఈ వారం ఆసీస్‌తో జరుగబోయే మరో రెండు వన్డేల్లో మంధన ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. రేటింగ్‌ పాయింట్లను మరింత మెరుగుపర్చుకుని అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకునే అవకాశం ఉంది. మంధన కీలక సమయంలో నంబర్‌ వన్‌ స్థానానికి ఎగబాకింది. ఈ నెలాఖరు నుంచి (సెప్టెంబర్‌ 30) భారత్‌, శ్రీలంకల్లో వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఇలాంటి తరుణంలో నంబర్‌ వన్‌ స్థానానికి ఎగబాకడం ఆమెకు మానసిక స్తైర్యాన్ని ఇస్తుంది. 

తాజా ర్యాంకింగ్స్‌లో మంధనతో పాటు మరో ఇద్దరు భారత బ్యాటర్లు కూడా లబ్ది పొందారు. ప్రతీక రావల్‌ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 42వ స్థానానికి.. హర్లీన్‌ డియోల్‌ 5 స్థానాలు మెరుగుపర్చుకుని 43వ స్థానానికి ఎగబాకారు. మిగతా భారత బ్యాటర్లలో హర్మన్‌ప్రీత్‌ 12వ స్ధానంలో.. జెమీమా రోడిగ్రెజ్‌ 15 స్థానంలో, దీప్తి శర్మ 24వ స్థానంలో, రిచా ఘోష్‌ 37 స్థానంలో ఉన్నారు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్‌ టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. భారత స్పిన్నర్‌ స్నేహ్‌ రాణా ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 16వ స్థానానికి ఎగబాకింది. మరో భారత బౌలర్ దీప్తి శర్మ 3 స్థానాలు దిగజారి 7వ ర్యాంక్‌ను పడిపోయింది. 

మిగతా భారత బౌలర్లలో రేణక సింగ్‌ ఠాకూర్‌ 26, క్రాంతి గౌడ్‌ 62, అరుంధతి రెడ్డి 65, పూజా వస్త్రాకర్‌ 77, శ్రీ చరణి 83, ప్రియా మిశ్రా 85, టైటాస్‌ సాధు 91, సైమా ఠాకోర్‌ 96 స్థానాల్లో ఉన్నారు.

ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన యాష్‌ గార్డ్‌నర్‌ టాప్‌ ప్లేస్‌ను నిలబెట్టుకోగా.. హేలీ మాథ్యూస్‌, మారిజన్‌ కాప్‌ టాప్‌-3లో ఉన్నారు. భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ 4వ స్థానంలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement