
అంతర్జాతీయ టీ20ల్లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ఫుల్ మెంబర్స్ దేశాల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి, భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను వెనక్కు నెట్టాడు.
నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోవడంతో ఈ ఘనత సాధించాడు. ఈ అవార్డుతో అంతర్జాతీయ టీ20ల్లో రజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల సంఖ్య 17కు చేరగా.. కోహ్లి, స్కై 16 వద్ద ఉన్నారు. ఓవరాల్‌గా (ఐసీసీ సభ్య దేశాలన్నీ) అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డు మలేసియా ఆటగాడు విరన్‌దీప్ సింగ్ (22) పేరిట ఉంది.
కొనసాగుతున్న రజా హవా
అంతర్జాతీయ టీ20ల్లో సికందర్ రజా హవా గత కొంతకాలంగా కొనసాగుతుంది. ఈ ఫార్మాట్‌లో అతను 39 ఏళ్ల లేటు వయసులోనూ ఇరగదీస్తున్నాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతూ, తన దేశం కాని దేశానికి వన్నె తెస్తున్నాడు. రజా పాకిస్తాన్‌లో పుట్టి, జింబాబ్వే తరఫున అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
2013లో అంతర్జాతీయ టీ20 కెరీర్ మొదలుపెట్టిన రజా.. 12 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించి, టాప్ ఆల్‌రౌండర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. వ్యక్తిగతంగా సత్తా చాటుతూనే, కెప్టెన్‌గా జింబాబ్వేకు చిరస్మరణీయ విజయాలు అందిస్తున్నాడు. తాజాగా అలాంటి ప్రదర్శనే మరోసారి చేసి, తమ కంటే చాలా రెట్లు పటిష్టమైన శ్రీలంకను చిత్తు చేయడంలో ముఖ్యపాత్ర పోషించాడు.
స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో నిన్న (సెప్టెంబర్ 6) జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌లో సత్తా చాటి తన జట్టుకు అదిరిపోయే విజయాన్నందించాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 11 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన రజా.. శ్రీలంకను 80 పరుగులకే కుప్పకూల్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే శ్రీలంకను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.