47 ఏళ్ల కిందటి రికార్డును రిపీట్‌ చేసిన శుభ్‌మన్‌ గిల్‌ | Shubman Gill Equals Gavaskar 47 Year Old Record With Half Century In First Home Test As Captain, Score Details Inside | Sakshi
Sakshi News home page

47 ఏళ్ల కిందటి రికార్డును రిపీట్‌ చేసిన శుభ్‌మన్‌ గిల్‌

Oct 3 2025 3:08 PM | Updated on Oct 3 2025 4:05 PM

Shubman Gill recreates Gavaskar's rare record as Indian Test captain vs West Indies

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో (India vs West Indies) భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ కెప్టెన్‌గా స్వదేశంలో తొలి ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీ బాది, 47 ఏళ్ల క్రితం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) నెలకొల్పిన రికార్డును పునరావృతం చేశాడు.

1978లో గవాస్కర్‌ భారత కెప్టెన్‌గా స్వదేశంలో తన తొలి ఇన్నింగ్స్‌లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. ముంబై వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా డబుల్‌ సెంచరీనే (205) బాదాడు. తిరిగి 47 ఏళ్ల తర్వాత శుభ్‌మన్‌ గిల్‌ స్వదేశంలో భారత కెప్టెన్‌గా తన తొలి ఇన్నింగ్స్‌లోనే హాఫ్‌ సెంచరీ మార్కు తాకాడు.

ఈ మ్యాచ్‌లో గిల్‌ సరిగ్గా 50 పరుగులు  (100 బంతుల్లో 5 ఫోర్లు) చేసి రోస్టన్‌ ఛేజ్‌ బౌలింగ్‌లో జస్టిన్‌ గ్రీవ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. విండీస్‌ను 162 పరుగులకే ఆలౌట్‌ చేసి తొలి ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్న భారత్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. రెండో రోజు మూడో సెషన్‌ సమయానికి జట్టు స్కోర్‌ 4 వికెట్ల నష్టానికి 338 పరుగులుగా ఉంది. ప్రస్తుతం 176 టీమిండియా 176 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ధృవ్‌ జురెల్‌ (75), రవీంద్ర జడేజా (56) అర్ద సెంచరీలు పూర్తి చేసుకొని ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు.

అంతకుముందు కేఎల్‌ రాహుల్‌ సూపర్‌ సెంచరీతో సత్తా చాటాడు. 190 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. వార్రికన్‌ బౌలింగ్‌లో గ్రీవ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీనికి ముందే శుభ్‌మన్‌ గిల్‌ సరిగ్గా 50 పరుగుల వద్ద ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 36, సాయి సుదర్శన్‌ 7 పరుగులు చేశారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌  162 ప‌రుగుల‌కే ఆలౌటైంది. సిరాజ్‌ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్‌ (6.1-0-25-2), వాషింగ్టన్‌ సుందర్‌ (3-0-9-1) ధాటికి విండీస్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది.

విండీస్‌ ఇన్నింగ్స్‌లో ఏడో నంబర్‌ ఆటగాడు జస్టిన్‌ గ్రీవ్స్‌ చేసిన 32 పరుగులే అత్యధికం. ఈ ఇన్నింగ్స్‌లో భారత వికెట్‌కీపర్‌ ధృవ్‌ జురెల్‌ 4 క్యాచ్‌లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement