టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (shubman gill).. రెండు ఫార్మాట్లలోనూ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. కానీ పొట్టి ఫార్మాట్ టి20లో స్థాయికి తగిన ఆటతీరు కనబరచడం లేదు. 26 ఏళ్ల వయసులో ఇండియన్ క్రికెట్ ఫేస్‌గా పేరుగాంచిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. పొట్టి ఫార్మాట్లోనూ పుంజుకోవాల్సి ఉంది. ప్రస్తుతం టీమిండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతడి తర్వాత టి20 జట్టు పగ్గాలు కూడా గిల్‌కే దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీని కంటే అంతర్జాతీయ టి20ల్లో తన గణాంకాలను అతడు మెరుగుపరుచుకోవాల్సి ఉంది.
శుబ్‌మన్ గిల్ ఎలాంటి బ్యాటరో క్రికెట్ అభిమానులకు తెలుసు. వన్డేలు, టెస్టుల్లో తానేంటో నిరూపించుకున్నాడు. సాంకేతికంగా అతడి బ్యాటింగ్ ఎటువంటి వంక పెట్టడానికి లేదు. క్లాసికల్ షాట్లు ఆడటంలోనూ దిట్ట. క్రీజులోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా మొదలుపెట్టి తర్వాత జోరు పెంచడం అతడి స్టయిల్.
భారీ ఇన్నింగ్స్ బాకీ
లాంగ్ ఫార్మాట్‌తో పోలిస్తే పొట్టి ఫార్మాట్‌లో బ్యాటింగ్ భిన్నంగా ఉంటుంది. పవర్ హిట్టింగ్ (Power hitting) చేసే వాళ్లే ఎక్కువగా మ్యాచ్ ఫలితాలను నిర్దేశిస్తూ ఉంటారు. గిల్ కూడా బంతులు ఎక్కువగా వృధా చేయకుండానే పరుగులు చేస్తుంటాడు. అయితే టి20ల్లో అతడి ప్రదర్శన స్థాయికి తగినట్టు లేకపోకడమే ప్రధాన సమస్య. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి20 సిరీస్‌లోనూ గిల్ పెద్దగా రాణించలేదు. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో కేవలం 5, 15 పరుగులు మాత్రమే చేశాడు. చివరి రెండు మ్యాచ్‌ల్లోనా భారీ ఇన్నింగ్స్ ఆడతాడేమో చూడాలి.
గట్టి పోటీ ఉన్నప్పటికీ..
సూర్యకుమార్ తర్వాత కెప్టెన్ పదవి అప్పగించాలన్న ఉద్దేశంతోనూ టి20 వైస్ కెప్టెన్‌గా గిల్‌ను నియమించింది బీసీసీఐ. దీంతో ఏడాది విరామం తర్వాత టి20 జట్టులోకి వచ్చాడు. సంజూ శామ్సన్, యశస్వీ జైశాల్ (Yashasvi Jaiswal) నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ భవిష్యత్తు కెప్టెన్ అనే ఉద్దేశంతో గిల్‌పైపు జట్టు యాజమాన్యం మొగ్గు చూపింది. డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు పవర్ హిట్టింగ్‌తో దుంచుతున్నారు. దీంతో గిల్ కూడా రిథమ్ అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

ఐపీఎల్‌లో అదరహో
ధనాధన్ క్రికెట్ సిరీస్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో గిల్‌కు మంచి రికార్డ్ ఉంది. గత ఐదేళ్లలో ప్రతి సీజన్‌లోనూ 400 పరుగులు తగ్గకుండా స్కోరు చేస్తున్నాడు. ఇప్పటివరకు 118 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన గిల్.. 39.44 సగటుతో 3866 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తక్కువ మ్యాచ్‌లే ఆడినప్పటికీ ఇంటర్నేషనల్ టి20ల్లో అతడి బ్యాటింగ్ సగటు స్థాయికి తగ్గట్టు లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటివరకు 31 అంతర్జాతీయ టి20ల్లో 28.22 సగటుతో 762 పరుగులు మాత్రమే సాధించాడు. ఇందుల్లో సెంచరీ, 3 హాఫ్ సెంచరీలున్నాయి.
సత్తా చాటాలి
ప్రస్తుతం అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్‌గా వస్తున్న గిల్.. మున్ముందు మ్యాచ్‌ల్లో అంచనాలకు తగినట్టుగా ఆడాల్సి ఉందని జట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. తక్కువ సమయంలోనే టెస్టులు, వన్డేల్లో తనదైన ముద్ర వేసిన ఈ యువ కెప్టెన్.. పొట్టి ఫార్మాట్‌లోనూ సత్తా చాటాలని టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.


